Health: 80 శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో ఆ సమస్య.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు
Health: మీరు ఐటీ ఉద్యోగం చేస్తున్నారా.? లేదా గంటల తరబడి ఒకేచోట కూర్చంటున్నారా.?
Health: మీరు ఐటీ ఉద్యోగం చేస్తున్నారా.? లేదా గంటల తరబడి ఒకేచోట కూర్చంటున్నారా.? అయితే మీకు ఈ ఆరోగ్య సమస్య రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకివెళితే.. భారతదేశంలోని ఐటీ ఉద్యోగులలో 80% మందికి ఫ్యాటీ లివర్ ఉందని హైదరాబాద్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం 2023-24 మధ్య 345 మంది ఐటీ ఉద్యోగులపై నిర్వహించగా, 84% మంది మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD)తో బాధపడుతున్నట్లు తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
అధ్యయనంలో భాగంగా పరిగణలోకి తీసుకున్న ఉద్యోగుల్లో 71 శాతం ఊబకాయంతో, 34 శాతం మంది మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఫ్యాటీ లివర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం చాలా కష్టం దీనికి కారణం ఈ వ్యాధికి స్పష్టమైన లక్షణాలు ఉండవు. కానీ సమస్య పెరిగే కొద్దీ అలసట, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.. MAFLD కారణంగా కాలేయంలో 5% కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ఇది నిర్లక్ష్యం చేస్తే, కాలేయ సిర్రోసిస్ లేదా క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
ఎక్కువ సేపు ఒకేచోట కూర్చొని పని చేసేవారు కచ్చితంగా 2 గంటలకు ఒకసారైనా లేచి నడవాలి. రోజుకు కనీసం గంట వ్యాయామం చేయండి. 45 నిమిషాలకొకసారి కొంతసేపు నడవండి.
తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి. అధిక కొవ్వు, మసాలా ఆహారం తగ్గించండి. మద్యం, ధూమపానం వదిలేయండి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.