తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తొలి మంత్రివర్గం సమావేశం జరిగింది.

Update: 2019-01-07 12:43 GMT

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తొలి మంత్రివర్గం సమావేశం జరిగింది. తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కొనసాగించడానికి వీలుగా అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలపై సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. నామినేటెడ్ సభ్యుడిగా స్టీఫెన్ సన్ ను నియమించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ గా మైనార్టీ వర్గానికి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ నియమించారు. అసెంబ్లీ నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్ సన్ పేరు సిఫార్సు చేశారు. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే గెజిట్ విడుదల అవుతుంది. చరిత్రలో గతంలో ఎన్నడు లేని విధంగా ఇతర సభ్యులతో పాటుగా నామినేటెడ్ సభ్యుడు కూడా అసెంబ్లీలో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 17న ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులకు భారత రాజ్యాంగం ప్రతులను తెలుగు, ఇంగ్లీషు, ఉర్ధూ భాషల్లో ఇవ్వనున్నారు. అసెంబ్లీకి సంబంధించిన వివిధ నిబంధనల పుస్తకాలను, బుక్ లెట్లను, ఇతర సమాచారాన్ని కూడా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహచార్యులు ముఖ్యమంత్రికి చూపించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గ సమావేశం అభినందించింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. 

Similar News