అటు జలకళ.. ఇటు ఇసుకమేటలు..

Update: 2019-05-17 10:07 GMT

అఖండ గోదావరి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రాంతంలో జలకళతో కళకళలాడుతోంది. మరోచోట కళతప్పి రైతులతో కన్నీరు పెట్టిస్తోంది. అటు నిండు కుండను తలపిస్తుంటే.. ఇటు, ఇసుకమేటలతో ఎడారిని తలపిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో భిన్నంగా దర్శనమిస్తోన్న జీవనదిపై స్పెషల్ స్టోరీ.

గోదావరి నిండుకుండలా దర్శనమిస్తోంది. గోదావరిలో నీటిమట్టం పూర్తిస్థాయిలో చేరుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్, సరస్వతీ ఘాట్లలో భారీగా నీరు చేరుకుంది. దీంతో వేసవిలో సరదాగా కోలాహలంగా స్థానికులు జలకాలాటలు ఆడుకుంటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ లో నీటి మట్టం పెరగడంతో మిగులు జలాలను గేట్ల ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏజన్సీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు తోడు శబరిలోకి సీలేరు, బలిమెల నుంచి ఇన్ ఫ్లో పెరిగింది. శబరి నుంచి గోదావరిలో ఇన్ ఫ్లో ప్రవాహం కలవడంతో సుమారుగా 4500 క్యూసెక్కుల నీటిప్రవాహం ఎగువ నుంచి దిగువకు ధవళేశ్వరం వరకూ ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతం రాజమండ్రిలో పుష్కరఘాట్లన్నీ జలకళతో కళకళలాడుతున్నాయి.

ఇదంతా ఏపీలోని ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర పరిస్థితి. అయితే, తెలంగాణలోని ఉమ్మడి ఆధిలాబాద్ జిల్లాలో మాత్రం గోదావరి కళతప్పింది. రైతులతో కన్నీరు పెట్టిస్తోంది. బాసర దగ్గర గోదావరి నదిలో క్రమంగా నీరు తగ్గిపోయి ప్రసుత్తం రాళ్లు, ఇసుక దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం రబీ సీజన్‌లో వేసిన పంటలు చివరి దశలో ఉన్నాయి. ఇదే సమయంలో గోదావరి నదిలో నీరు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గోదావరి నది తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదలై కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ మీదుగా ఏపీలోకి ప్రవేశించి రాజమండ్రి చేరుతుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గోదావరిలోని ఎగువ ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ లో చుక్క నీరు లేదు. దిగువ ప్రాంతమైన రాజమండ్రిలో మాత్రం భారీగా నీరు ఉంది. ఒకే సమయంలో ఇరు ప్రాంతాల్లో భిన్నంగా దర్శనమిస్తోంది గోదారమ్మ.  

Full View

Similar News