వైసీపీలో అసంతృప్తి సెగలు..

Update: 2019-03-12 16:02 GMT

వైసీపీలో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. నామినేషన్లకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆశావహులు టిక్కెట్ల కోసం పార్టీ ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. చివరికి లోటస్ పాండ్‌ను కూడా వదిలిపెట్టడంలేదు. ఏకంగా జగన్ నివాసం ముందే ఆందోళనలు నిర్వహించారు. వైసీపీలో ఉరవకొండ వివాదం రోడ్డునపడింది. జగన్‌ను కలిసేందుకు వచ్చిన వైఎస్ వివేకానంద రెడ్డి వాహనాన్ని శివరామిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఉరవకొండ టిక్కెట్‌ను విశ్వేశ్వరరెడ్డికి ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. శివరామిరెడ్డి వర్గీయులకు వివేకానందరెడ్డి సర్దిచెప్పే యత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. విశ్వేశ్వరరెడ్డికి టిక్కెట్ ఇస్తే ఉరవకొండలో వైసీపీ ఓడిపోతుందంటూ శివరామిరెడ్డి అనుచరులు తేల్చి చెప్పారు.

ఇటు బాపట్ల వైసీపీలోనూ విబేధాలు బయటపడ్డాయి. కోణ రఘుపతికి టిక్కెట్ ఇవ్వద్దంటూ రెడ్డి సామాజిక వర్గం నిరసన ర్యాలీ తీసింది. రావాలి జగన్ పోవాలి కోణ అంటూ ఆయన వ్యతిరేకులంతా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఏకంగా రోడ్డెక్కడంతో బాపట్ల వైసీపీలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగింది.ఇక చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం వైసీపీలో ముసలం మొదలైంది. ఓసారి ఎమ్మెల్సీగా, మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దేశాయ్‌ తిప్పారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తనను కాదని టిక్కెట్‌ మరొకరికి కేటాయించనున్నట్టు పార్టీ అధిష్ఠానం చెప్పడంతో రెండు రోజుల్లో తన భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన దేశాయ్‌ తిప్పారెడ్డి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని ప్రకటించారు.

మరోవైపు చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కు చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నసునీల్ కు ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని జగన్ నివాసం వద్దకు కుటుంబసభ్యులతో కలసి ఆయన వచ్చారు. దాదాపు రెండు గంటల సేపు జగన్ నివాసం వద్ద వేచి చూసినా ఆయనను లోపలకు అనుమతించలేదు. ఇదే సమయంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడకు వచ్చారు. సునీల్ ను పట్టించుకోకుండా ఆయన లోపలకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో సునీల్ మరింత మనస్తాపానికి గురయ్యారు.

Similar News