శబరిమలలో టెన్షన్..టెన్షన్..

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం తర్వాత అయ్యప్ప భక్తులు రగిలిపోతున్నారు. యాభై ఏళ్లలోపూ ఇద్దరు మహిళలు గుడిలోకి ప్రవేశించడాన్ని నిరసిస్తూ కేరళలో బంద్‌‌ పాటిస్తున్నారు.

Update: 2019-01-03 03:52 GMT
Sabarimala protests

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం తర్వాత అయ్యప్ప భక్తులు రగిలిపోతున్నారు. యాభై ఏళ్లలోపూ ఇద్దరు మహిళలు గుడిలోకి ప్రవేశించడాన్ని నిరసిస్తూ కేరళలో బంద్‌‌ పాటిస్తున్నారు. శబరిమల కర్మ సమితి, హిందూ సంస్థలు బంద్‌ పాటిస్తున్నాయి. బంద్‌ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగకుండా కేరళ ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది.

శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయాలకు విరుద్ధంగా హిందూ సంస్థల సవాళ్లను ధిక్కరిస్తూ శబరిమల ఆలయంలోకి యాభయ్యేళ్ల వయసులోపు మహిళలు ప్రవేశించడంపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. మహిళల ఆలయప్రవేశంతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శబరిమలలో అయ్యప్ప భక్తులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కేరళలో నిరసనలకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతోంది. బంద్ కు పిలుపునిచ్చిన శబరిమల కర్మ సమితి సీఎం విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

నిన్న తెల్లవారుజామున 3గంటల 38 నిమిషాల సమయంలో కనకదుర్గ, బిందు అనే మహిళలు పోలీసుల సాయంతో ఆలయంలోకి వెళ్లి, స్వామి దర్శనం చేసుకున్నారు. శాశ్వత బ్రహ్మచారిగా పేరొందిన అయ్యప్ప ఆలయంలోకి పది నుంచి 50 ఏళ్ల వయసు లోపువారు ప్రవేశంపై నిషేధం ఉంది. అయితే, 3 నెలల క్రితం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీంతో నల్లని దుస్తులు ధరించిన మహిళలు, ముఖాలపై ముసుగు వేసుకుని నిన్న స్వామి దర్శనానికి వెళ్లారు. మహిళల ఆలయప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

శబరిమల కర్మ సమితి, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్తు ఇవాళ కేరళలో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బ్లాక్‌డేగా పాటించనున్నట్లు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రకటించింది. ఇటీవల కాలంలో తరచూ బంద్‌లతో విసిగిపోయిన వ్యాపార సంఘాలు బంద్‌ పిలుపును తిరస్కరిస్తూ, దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూత్వ సంస్థలు, కార్యకర్తలు కాసర్‌గోడ్‌-మంగళూరు రహదారిపై వాహనాల్ని నిలిపివేశారు. దేవస్థానం బోర్డు కార్యాలయాలకు తాళాలు వేశారు. కేరళ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో అయ్యప్ప చిత్రపటాలతో, పాటలు పాడుతూ నిరసన తెలిపారు.

మహిళల అయ్యప్ప దర్శనం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తిరువనంతపురంలో రాష్ట్ర సచివాలయం దగ్గర బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. అధికార పార్టీ సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని, ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో రాష్ట్ర సచివాలయం పరిసరాలు దాదాపు ఐదు గంటలపాటు యుద్ధక్షేత్రాన్ని తలపింపచేశాయి. రహదారులను దిగ్బంధించారు. షాపులు, మార్కెట్లు మూతపడ్డాయి. పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి ఎంతోమంది మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు యత్నించినా అయ్యప్ప భక్తుల నిరసనలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఎన్నోనిరసనలు మరెన్నో వ్యతిరేకతలతో గత కొంతకాలం నుంచి యాభయ్యేళ్లలోపు మహిళల ప్రవేశానికి ఎదురైన అవరోధాలను ఛేదించుకుని ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారు. పోలీసుల సాయంతో దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం ఘటనపై కేరళ విపక్షాలు కాంగ్రెస్‌, బీజేపీలు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై మండిపడ్డాయి.

శబరిమలలోకి పది నుంచీ యాభయ్యేళ్లలోపు వయసున్న మహిళల ప్రవేశంపై ఎప్పట్నుంచి నిషేధం ఉందనే విషయంలో ఖచ్చితమైన ఆధారాలు లేకున్నా 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ సర్వే నివేదిక ప్రకారం, 200 ఏళ్ల క్రితం నుంచే ఆంక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 1991 కేరళ హైకోర్టు తీర్పుతో అనధికార ఆంక్షలకు చట్టపరమైన గుర్తింపు, ఆమోదం లభించాయి. 

Similar News