ప్రకాశం జిల్లాలో ఓట్ల తొలగింపు రాజకీయం. టీడీపీ, వైసీపీల పరస్పర ..

Update: 2019-03-03 07:09 GMT

'ఓటరుగా చేరతాను'అంటూ దరఖాస్తులు రావడం సాధారణం. కానీ ప్రకాశం జిల్లాలో 'నేను ఓటరును కాదు, తీసేయండి' అని దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈ ఫారం-7దరఖాస్తులు వేల సంఖ్యలో వస్తుండడంతో అధికారులు విస్తుపోతున్నారు. ఈ ఓట్ల తొలగింపు వెనుక దాగి ఉన్న అసలు తంతు ఏమిటో చూడండి.ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రకాశం జిల్లాలో కొత్త తరహా రాజకీయం ప్రారంభమైంది.

అధికార పార్టీ.. ప్రతిపక్షం పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తే, ప్రతిపక్షం అధికార పక్షం మద్దతుదారుల ఓట్లు తొలగిస్తుంది. చివరకు రెండు పార్టీల వాళ్లు తమ వాళ్ల ఓట్లు తీసేశారని అధికారులకు పోటా పోటీగా ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్రత్యర్థుల ఓట్లను తగ్గిస్తే గెలుపు సులువు అధికార, విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. కొంతమంది పార్టీల నాయకులు తమకు పరిచయమున్న ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ద్వారా ప్రత్యర్థుల ఓట్ల తొలగింపు దరఖాస్తులు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లావ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా 47 వేల ఈ ఫారం-7దరఖాస్తులు రాగా, అత్యధికంగా పర్చూరు నియోజకవర్గం నుంచి 7608 అప్లికేషన్ లు వచ్చాయి. కుట్రపూరితంగా ఓట్లు తొలగిస్తున్నారు అనే ఆరోపణలు రావడంతో కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయా పార్టీల నాయకులు మాత్రం పరస్పర విమర్శలు సంధించుకుంటున్నారు.

అద్దంకి, పర్చూరు,మార్కాపురంలో ఓట్ల తొలగింపు తంతు అధికంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.పర్చూరు నియోజకవర్గం మార్టూరులో ఓట్లు తొలగించాలంటూ ఒకే కంప్యూటర్ సెంటర్ నుంచి 55 దరఖాస్తులు వస్తే, మార్కాపురం నుంచి 30 దరఖాస్తులు వచ్చాయి. తమ పేరిట వేరేవారు దరఖాస్తు చేశారని కొందరు ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌(ఐపీ)నంబరు ద్వారా చేధించే పనిలో పడ్డారు. ఇప్పటికే అద్దంకి, మార్కాపురం, పర్చూరు ప్రాంతాలకు చెందిన కొందరిని గుర్తించి ప్రశ్నిస్తున్నారు. 

Similar News