నేడు విజయవాడ, అనంతపురంలో రాహుల్ పర్యటనలు... టార్గెట్ నరేంద్ర మోదీ

Update: 2019-03-31 04:43 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఏపీలో పర్యటనకు వస్తున్నారు. ఇవాళ ఉదయం విజయవాడలోనూ సాయంత్రం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం‌లోనూ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. రాహుల్ ప్రచారంతోనైనా కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంటుందని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. మొన్ననే బీజేపీ తరపున నరేంద్ర మోడీ రాగా ఇవాళ కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతుంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌‌ మాత్రం స్థానిక నేతలతోనే ప్రచారం సాగిస్తోంది. ఎన్నికల రణక్షేత్రంలో వెనకబడిన ఏపీ కాంగ్రెస్ కోసం ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్వయంగా వస్తున్నారు. ఇవాళ ఏపీలో రాహుల్ ప్రచార భేరి మోగించబోతున్నారు. ప్రత్యేక హోదా అస్త్రంగా ప్రచారం సాగిస్తారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరుగుతుందని చాటబోతున్నారు.

ఇవాళ రాహుల్ విజయవాడ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం‌లో రెండు ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతారు. ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రాజధాని ప్రాంతమైన విజయవాడలో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం సింగ్ నగర్ లోని బసవపున్నయ్య స్టేడియం వేదికగా రాహుల్ ప్రసంగిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్దులతో పాటు కృష్ణాజిల్లా అసెంబ్లీ అభ్యర్దులను రాహుల్ ప్రజలకు పరిచయం చేస్తారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోటీ చేస్తున్న కళ్యాణదుర్గం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ పాల్గొంటారు. రాహుల్ పర్యటన ఏపీ కాంగ్రెస్‌కు కొండంత బలాన్ని ఇస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News