రాజంపేట రాజకీయానికి.. లోటస్‌పాండ్‌లో పుల్ స్టాప్. అసలు ఏం జరిగింది?

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రాజంపేట రాజకీయానికి చివరకు లోటస్‌పాండ్‌లో ఫుల్‌స్టాప్‌ పడింది. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి హైదరాబాద్‌లో జగన్‌ను కలిశారు.

Update: 2019-01-23 06:49 GMT

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రాజంపేట రాజకీయానికి చివరకు లోటస్‌పాండ్‌లో ఫుల్‌స్టాప్‌ పడింది. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి హైదరాబాద్‌లో జగన్‌ను కలిశారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీలో నరకం అనుభవించానన్న మేడా గంజాయివనం నుంచి తులసీవనంలోకి వచ్చినట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు.

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు. 2014 లో టీడీపీ తరపున గెల్చిన మేడా గత కొన్నాళ్లుగా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారంపై ఆ పార్టీలో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. దీనిపై రాజంపేట టీడీపీ కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో మంగళవారం చంద్రబాబు ముందుకు మేడా పంచాయితీ చేరింది. అమరావతిలో సీఎం నివాసంలో జరిగిన భేటీలో కార్యకర్తలంతా మేడాపై విమర్శలు చేశారు. దీంతో అదే సమయంలో మేడాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేేరేందుకు నిర్ణయించుకున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిశారు. తన అనుచరులతో జగన్‌తో సమావేశం అయ్యారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీలో చాలా ఇబ్బందులు పడ్డానని గంజాయివనం నుంచి తులసీవనంలోకి వచ్చినట్లుగా ఉందని మేడా తెలిపారు. తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్న మేడా ఈ నెల 31 న వైసీపీ తీర్థం పుచ్చుకుంటానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలని రాజంపేటను అభివృద్ధి చేయాలనేదే తన ధ్యేయం అని అన్నారు.

చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని మేడా విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. సంతలో పశువులను కొన్నట్లు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని చంద్రబాబును ఓడించి జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తానిప్పటికే రాజీనామా చేశానని చెప్పిన మేడా మల్లికార్జునరెడ్డి బుధవారం స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పిస్తానని స్పష్టం చేశారు.  

Similar News