వ్యవసాయ బావిలో చిరుతపులి .. ఎట్టకేలకు బయటకు తీసిన అటవీ అధికారులు..

Update: 2019-06-09 02:49 GMT

చిరుత పులి. ఆ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఇక చిరుతను కనపడిందంటే చాలూ ఆమడదూరం పరిగెడుతాం.. అలాంటి చిరుతకు చాలా పెద్ద కష్టం వచ్చింది. అడవుల్లో తిరగాల్సిన చిరుత పులి వ్యవసాయ బావిలో పడి లబోదిబోమంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది. నిర్మల్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది.నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురాలో ఓ చిరుతపులి వ్యవసాయ బావిలో పడటం కలకలం రేపింది. ఆహారం కోసం గ్రామ శివార్లోకి వచ్చిన చిరుత వ్యవసా బావిలో పడిపోయింది.. పొలం దగ్గరకు వచ్చిన రైతులు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిరుతను చూసి.. పోలీసులకు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బావిలో ఉన్న చిరుతను చూసేందుకు చుట్టుపక్కల జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఖానాపూర్ రేంజ్ అటవీ శాఖ అధికారి వినాయక్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావి నుంచి చిరుతను బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి ఓ పొడవాటి నిచ్చెనను ఏర్పాటు బావిలోకి దింపారు.. దాదాపు రెండు గంటల పాటు శ్రమించగా నిచ్చెన సహాయంతో పైకి వచ్చిన చిరుత సమీప అడవిలోకి పరుగు తీసింది. చిరుత వయస్సు సుమారు మూడేండ్లు ఉంటుందని ఖానాపూర్ రేంజ్ అధికారి వినాయక్ తెలిపారు. చిరుత బావిలో పడినప్పటికీ అందులో నీళ్లు ఉండటంతో పెద్దగా గాయాలు కాలేదన్నారు.

కొంత కాలంగా పులులను వేటాడి చంపుతుండగా..చాకచక్యంగా వ్యవహరించి బావిలో పడిన చిరుతను కాపాడిన పోలీసులను, అటవీ అధికారులను స్థానికులు అభినందించారు.  

Tags:    

Similar News