గ్రామస్థాయిలో సమస్యలపై దృష్టి సారించండి : నేతలకు పవన్ సూచన

Update: 2019-05-12 12:52 GMT

ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన అభ్యర్థులతో సమావేశమయ్యారు. పోలింగ్‌ సరళి, గెలుపు అంశాలపై అభ్యర్థులతో జనసేనాని చర్చించారు. కౌంటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవన్‌ అభ్యర్థులకు సూచనలు ఇచ్చారు. జిల్లాలవారీగా పార్టీ యువ అభ్యర్థులతో ఈ వరుస భేటీలు నిర్వహించారు. అభ్యర్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా పవన్ నేతలతో చర్చించారు. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని గ్రామగ్రామాన పఠిష్టం చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా గ్రామస్థాయిలో సమస్యలపై నేతలు దృష్టి సారించాలని పార్టీ అధినేత కోరినట్లు సమాచారం. గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేయాలని నేతలకు పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో తమకు ఎదురైన అనుభవాలను పవన్ కు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి జనసేన పోటీకి దిగింది. జనసేన 140 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి.. మిగిలిన సీట్లను మిత్రపక్షాలైన బీఎస్పీ(21).. సీపీఐ, సీపీఎంలకు కలిపి 14 స్థానాలు కేటాయించింది. ఇక అధినేత పవన్ విశాఖ జిల్లా గాజువాక.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు. పవన్ సోదరుడు నాగబాబు నర్సాపుంర ఎంపీగా బరిలోకి దిగారు.  

Similar News