హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

Update: 2019-04-23 03:58 GMT

తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు వానలకు నలుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పిడుగులు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం చేసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం చేశాయి. పలు చోట్ల హోర్డింగులు కుప్పకూలిపోయాయి. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలిపోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడు జీఎస్టీ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టవర్ కింద నలిగి అనేక కార్లు ధ్వంసమయ్యాయి.

మరోవైపు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్‌లో ఈదురుగాలులకు షెడ్డు కూలిన ఘటనలో ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. షెడ్డు కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కూకట్‌పల్లి, గాంధీనగర్‌, వెంగళరావు పార్కు సమీపంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలి పలువురికి గాయాలయ్యాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో కార్లు ధ్వంసమయ్యాయి. లక్డీకాపూల్‌, మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద హోర్డింగ్‌లు కూలడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పాతబస్తీలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌కు ఈదురు గాలులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రహదారులకు అడ్డంగా కూలిన చెట్లను వెంటనే తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు. 

Similar News