నిన్న చెప్పు దాడి ఇవాళ చెంపపై దాడి

Update: 2019-04-19 07:46 GMT

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై బూటు దాడి మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత హార్ధిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని సురేందర్‌ నగర్‌ ఎన్నికల సభలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి హార్ధిక్ పటేల్‌పై దాడి చేశాడు. ఒక్కసారిగా వేదిక మీదకు వచ్చిన అజ్ఞాత వ్యక్తి వచ్చి రావడంతోనే హార్ధిక్ పటేల్‌ చెంపపై కొట్టాడు. ఊహించని విధంగా ఒక్కసారిగా జరిగిన ఘటనతో హార్ధిక్ బిత్తరపోయాడు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు, వేదిక మీద నేతలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు.

ఇదే తరహాలో నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై కూడా జరిగింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి జీవీఎల్‌పైకి బూట్లు విసిరేశాడు. దాడి నుంచి జీవీఎల్ తృటిలో తప్పించుకున్నా ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. దాడి చేసిన వ్యక్తి దగ్గర లభించిన విజిటింగ్ కార్డు ఆధారంగా కాన్పూర్‌కు చెందిన భార్గవ్ అనే వైద్యుడిగా గుర్తించారు. మానిసక స్థితి సరిగా లేకపోవడం వల్లే దాడి చేశాడంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నా బీజేపీ కార్యాలయంలోనే దాడికి పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలే తనపై దాడి చేయించారంటూ జీవీఎల్ ఆరోపించారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో నేతలపై ఇలాంటి దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాజ్యసభ సభ్యుడితో పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్‌పై దాడి జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో బహిరంగ సభలో వేదికపై మాట్లాడుతున్న హార్ధిక్ దగ్గరకు గుర్తు తెలియని వ్యక్తి నేరుగా రావడం దాడికి పాల్పడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ రెండు ఘటనలు అనుకోకుండా జరిగినవి కాదని పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో హైలెట్ అయ్యేందుకు కొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే మరికొందరు మాత్రం తమలోని అసహనం, ఎదుటివారి ద్వేషం, మానసిక పరిస్ధితుల కారణంగానే దాడులకు పాల్పడుతున్నారంటూ సైకాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.    

Similar News