పశ్చిమ బెంగాల్ అల్లర్లపై ఈసీ కొరడా

Update: 2019-05-16 08:44 GMT

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఈసీ ఆదేశంతో ఒక్క రోజు ముందే ప్రచారానికి తెరపడనుంది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో హింసపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324ను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో మాత్రం ప్రచారాన్ని ఇవాళ్టితో ముగించాలని ఈసీ ఆదేశించింది.

అమిత్ షాపై కోల్‌కతా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను నీరుగార్చేందుకు వ్యవస్థలను మమతా బెనర్జీ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌లో రాజకీయ హింసాకాండ ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు మమతా బెనర్జీ ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల ప్రొఫైల్ ఫోటోలను మార్చుకున్నారు. ఇంతకు ముందున్న ఫోటోల స్థానంలో ఈశ్వర చంద్ర విద్వాసాగర్ చిత్రాన్ని ఉంచారు. అమిత్ షా ర్యాలీలో చెలరేగిన ఘర్షణల్లో విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ నాయకులు వీటిని మార్చుకుని నిరసన వ్యక్తం చేశారు.

Similar News