సిక్కోలులో ధర్మాన నిలబడేనా? లేదంటే మళ్లీ లక్ష్మీకటాక్షమా?

Update: 2019-05-08 10:52 GMT

ఆయన ఒకప్పుడు కీలక మంత్రిగా చక్రం తిప్పారు జిల్లాపై ఎనలేని పట్టు ప్రదర్శించారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక్కసారిగా బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు కసితో రగిలిపోతున్నాడు. పడి లేచిన కెరటంలా దూసుకువచ్చానంటున్నాడు. తన అనుభవాన్నంతా రంగరించి, ఎన్నికల ప్రచారంలో హోరెత్తించాడు అటు తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గెలుపు మలుపు తనదేనంటున్నారు. మధ‌్యలో జనసేన సైతం కళ్లు ఉరిమి చూస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం. త్రిముఖ సమరంలో ప్రముఖం ఎవరు?

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీకాకుళం కార్పోరేషన్, శ్రీకాకుళం రూరల్ , గార మండలాలు ఉన్నాయి. సామాజికవర్గాల పరంగా వెలమ సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో కలింగ వైశ్యులు, మూడు,నాలుగు,ఐదు స్థానాల్లో కాళింగ,మత్స్యకారులు,శిష్టకరణాలు ఉన్నారు. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొదటిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పసగాడ సూర్యనారాయణ అధికారం దక్కించుకోగా, ఆ తరువాత జరిగిన ఐదు సార్వత్రిక ఎన్నికల్లోనూ జనతా పార్టీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు విజయం సాధించారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత 1985,89,94,99 వరుసగా నాలుగుసార్లు ప్రస్తుత ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి భర్త గుండ అప్పల సూర్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత వచ్చిన 2004,09 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసిన ధర్మాన ప్రసాదరావు, ఈయనపై గెలుపొందారు.

ఈ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రకారం 2,55,177 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 87,367 మంది పురుషులు, 91,278 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు ఓటర్ల తీర్పు పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనే టెన్షన్ రాజకీయ వర్గాలతో పాటు నియోజకవర్గ ప్రజల్లోనూ కనిపిస్తోంది.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు ఓటమి పాలయిన గుండ అప్పల సూర్యనారాయణ స్థానంలో అతని భార్య గుండ లక్ష్మీదేవిని, 2014 ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా బరిలో దింపింది. అంతవరకు సాధారణ గృహిణిగా ఉన్న గుండ లక్ష్మీదేవి అనూహ్యంగా 24,131 ఓట్ల మెజారిటీతో తన సమీప అభ్యర్ధి ధర్మాన ప్రసాదరావుపై విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు లక్ష్మీదేవి.

ధర్మాన ప్రసాదరావు దశాబ్ద కాలంపాటు మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు , అతని అనుచరులు రౌడీయిజం చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయని, వీటికి తోడూ గడిచిన ఐదేళ్ళలో తాను చేసిన అభివృద్ధి, తనను నియోజకవర్గంలో తిరిగి అధికారంలోకి తెస్తాయన్న దీమాలో ఉన్నారు లక్ష్మీదేవి. టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణతో విజయం తనదే అనే కాన్ఫిడెన్స్ ఆమెలో కనిపిస్తోంది.

అదే సమయంలో వైసిపి అభ్యర్ధి ధర్మాన ప్రసాదరావు సైతం గెలుపుపై అంతే దీమాతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాను మంత్రిగా పనిచేసిన సమయంలో శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు జిల్లాలో తాను చేసిన అభివృద్ది పట్ల, ప్రజల్లో ఉన్న అభిమానం తనకు ప్లస్‌గా మారుతుందనే భావనలో ఉన్నారు ధర్మాన. గతంలో అతని అనుచరుల వలన తీవ్రంగా నష్టపోయిన ధర్మాన ప్రసాదరావు, ఈసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్నికల ముందు నుంచి వారిని కాస్త దూరంగా పెట్టారు. అదేసమయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత, అభివృద్ది, సంక్షేమ పథకాల్లో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తితో ఉన్న ప్రజలు, తమ పార్టీవైపు చూస్తున్నారన్న భావనలో ఉన్నారు ధర్మాన. పోలింగ్‌లో భారీ ఎత్తున పాల్గొన్న జనాన్ని చూస్తుంటే, తననే గెలిపించారన్న కాన్ఫిడెన్స్‌ ఆయనది.

ఇదిలావుంటే, మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి వచ్చిన జనసేన ప్రభావం సైతం నియోజకవర్గంలో ఉంటుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోమటి సామాజికవర్గానికి చెందిన కోరాడ సర్వేశ్వరరావును, జనసేన ఇక్కడ అభ్యర్ధిగా బరిలో దింపింది. గెలుపు విషయం కంటే, జనసేన ప్రభావం టిడిపి, వైసిపిలలో ఎవరిపై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యువత, తటస్థ ఓటర్లతో పాటు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారి ఓట్లతో, చీలిక ఉంటుందని రాజకీయ విశ్లేషకుల భావన. ఈ ఓట్ల చీలిక ఎవరికీ అనుకూల, ఎవరికీ ప్రతికూల అంశంగా మారుతుందనేది ప్రస్తుతం నియోజకవర్గంలో ఉత్కంఠ కలిగిస్తోంది.

మొత్తం మీద ఎన్నికల్లో ముఖ్యమైన ఘట్టం పోలింగ్ సమరం ప్రశాంతంగా ముగిసినా, గెలుపు ఎవరిని వరిస్తుంది అనే టెన్షన్ ఇప్పుడు నియోజకవర్గంలో కాక రేపుతోంది. గెలుపుపై ఎవరికీ వారు జబ్బలు చరుచుకుంటున్నా, లోలోన భయం మాత్రం నాయకులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.  

Full View

Similar News