ఇంతకీ ఆ బాలిక ఏమైంది...అడవిలోకి ఎందుకెళ్లింది..?

Update: 2019-05-31 11:08 GMT

నల్లమల అడవి. తెలుగు రాష్ట్రాల్లో అతి దట్టమైన భయంకరమైన అడవి. చిరుత, తోడేళ్లు, పులులకు ఆవాసం ఈ అటవీ ప్రాంతం. ఇటువంటి భయంకరమైన అడవిలో ఎవరూ ఒంటరిగా జీవించలేరు. ఇక్కడ ఎవరైనా చిక్కుకుంటే ఏ దిక్కు ఎటువైపు పోతుందో తెలియదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎటుచూసినా భారీ వక్షాలు. చుట్టూ రాళ్లు, గుట్టలు. ఎతైన కొండలు.. లోతైన లోయలు. ఓ వైపు రాళ్లు సైతం పగిలే ఎండ. మరోవైపు తీవ్రమైన వడగాల్పులు. గుక్కెడు నీరు దొరకడమే కష్టం. అలాంటి అడవిలో వారం రోజులు ఎటువంటి ఆహారం, నీరు లేకుండా ఉండగలరా..? ఒక వేళ ఉన్నా క్రూర మృగాలు ఎదురైతే పరిస్థితి ఏమిటి..?

ఇద్దరు డీఎస్పీ, నలుగురు సీఐలతో కలిసి మొత్తం వంద మంది పోలీసులు. నల్లమలను జల్లెడపడుతున్నారు. అడవిలోని ప్రతీ అంగుళాన్ని గాలిస్తున్నారు. అయితే వీరు వెతుకుతోంది ఏ మావోయిస్టుల కోసమే కాదు.. అడవిలో తప్పిపోయిన 6 ఏళ్ల బాలిక కోసం. ఇంతకీ ఆ బాలిక ఏమైంది..? అడవిలోకి ఎందుకెళ్లింది..?

అది దట్టమైన నల్లమల అడవి. భారీ వృక్షాలు.. క్రూర మృగాలకు నిలయం. ఆ భయంకరమైన అడవిలో 6 ఏళ్ల బాలిక. ఎక్కడ ఉందో.. ఏం చేస్తోందో తెలియదు. ఆ బాలిక ఆచూకీ కోసం ఏడు రోజులుగా వంద మందికి పైగా పోలీసులు గాలిస్తున్నారు. అడవిలో అణువణువూ జల్లెడ పడుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లాపూర్ చెంచుపెంటకు చెందిన శ్రావణి, రేణుక అనే ఇద్దరు బాలికలు ఆడుకుంటూ అడవిలోకి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక దారి తప్పిపోయారు. వీరిలో రేణుక మాత్రం ఏదో విధంగా శ్రీశైలం- మన్ననూరు రహదారిపైకి రావడంతో కొందరు వాహనదారులు పోలీసులకు అప్పగించారు. అలా రేణుక వారి తల్లిదండ్రుల వద్దకు చేరింది. అయితే శ్రావణి ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో రెండు రోజులు గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అడవిని జల్లెడపడుతున్నారు. నాగర్ కర్నూల్ డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుళ్లు, 20 మంది హోం గార్డ్స్ నల్లమల అడవిలో ముమ్మర గాలింపు చేపడుతున్నారు. ఇన్ని రోజులైనా పాప ఆచూకీ మాత్రం తెలియలేదు. అయినా అలుపెరుగకుండా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

Similar News