టీటీడీ బంగారం తరలింపు వివాదంలో కొత్త మలుపు

Update: 2019-04-22 02:32 GMT

తీవ్ర సంచలనం సృష్టించిన టీటీడీ బంగారం తరలింపు వివాదంపై ఏపీ సీఎస్‌ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఎన్నికలవేళ బంగారాన్ని తరలించడమే కాకుండా కనీస భద్రతా చర్యలు తీసుకోలేదంటూ టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బందిపై ఆరోపణలు రావడంతో సీఎస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్‌‌సింగ్‌ను విచారణాధికారిగా నియమించి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

టీటీడీ బంగారం వివాదం కొత్త మలుపు తిరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381 కేజీల బంగారం తరలింపుపై దర్యాప్తునకు ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్‌‌సింగ్‌ను విచారణాధికారిగా నియమించిన సీఎస్‌ టీటీడీ బంగారం తరలింపులో భద్రతా లోపాలపై విచారణ జరపాలని ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే తిరుమల వెళ్లాలని విచారణాధికారిని ఆదేశించిన సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఈనెల 23లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు.

టీటీడీకి చెందిన 1381 కిలోల బంగారాన్ని చెన్నైలోని పంజాబ్‌ నేషనల్ బ్యాంకు నుంచి తిరుపతికి తీసుకొస్తుండగా ఈనెల 17న తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఆ బంగారానికి సంబంధించిన పత్రాలను బ్యాంకు ఉద్యోగులు గానీ, టీటీడీ అధికారులు గానీ చూపకపోవడంతో పోలీసులు అనుమానించి సీజ్ చేశారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలో నాలుగు రోజుల తర్వాత స్పందించిన టీటీడీ అధికారులు పత్రాలను చూపించి ఆ బంగారాన్ని తిరుపతికి తీసుకొచ్చారు.

అయితే రాత్రి సమయంలో కనీస భద్రత లేకుండా ట్రక్‌లో బంగారాన్ని తరలించడంపై పలు అనుమానాలు తలెత్తాయి. ముఖ‌్యంగా టీటీడీ అధికారులు, విజిలెన్స్‌ సిబ్బంది తీరుపై అనేక ఆరోపణలు వచ్చాయి. టీటీడీ బంగారం తరలింపులో భద్రతా లోపాలతోపాటు అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు రావడంతో సమగ్ర దర్యాప్తునకు సీఎస్ ఆదేశించారు.

Similar News