అన్న బాటలోనే పయనిస్తున్న తమ్ముడు..

Update: 2019-03-19 16:21 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే జనసేనాని రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలోకి దిగుతున్నారు. జనసేన అధినేత నామినేషన్ ఎప్పుడు వేసేది ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆసక్తిరేపింది. చివరికి ఈ అంశంపై జనసేనాని స్ఫష్టత ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. జనసేన జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు నిశితంగా ఆలోచించి భీమవరం, గాజువాకను ఫైనల్ చేశారు.

పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై జనసేన పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. మొత్తం 8స్థానాల్లో సర్వే నిర్వహించారు. అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు చేసి అందులో భీమవరం, గాజువాకను ఎంపిక చేశారు. నిజానికి పవన్‌కల్యాణ్‌ గాజువాక నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే భీమవరం పేరు మాత్రం అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. ముందుగా అనుకున్నట్లు ఉత్తరాంధ్ర నుంచి ఒక స్థానంలో పోటీ చేస్తుండగా రెండో స్థానం ఆయన సొంత జిల్లా నుంచే కావడం గమనార్హం.

ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ తన అన్నయ్య చిరంజీవి బాటనే అనుసరించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరు రెండు చోట్ల పోటీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి బరిలో నిలిచారు, అయితే ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొంది సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఓడిపోయారు. ఇక గాజువాకలో పవన్ ప్రత్యర్థులుగా టీడీపీ నుంచి పల్లా జనార్థన రావు, వైసీపీ నుంచి టి. నాగిరెడ్డి ఉన్నారు. భీమవరంలో పవన్..టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుతోనూ వైసీపీ గ్రంథి శ్రీనివాస్‌తోనూ తలపడాల్సి ఉంటుంది.

Similar News