తేనేటీగల పెంపకంతో మంచి ఆదాయం అర్జిస్తున్న యువ రైతులు..

Honey Bee Farming: ఉన్నత చదువులు చదివినా ఒళ్ళు వంచడానికి సిగ్గుపడలేదు ఆ యువకులు

Update: 2022-03-07 13:17 GMT

తేనేటీగల పెంపకంతో మంచి ఆదాయం అర్జిస్తున్న యువ రైతులు..

Honey Bee Farming: ఉన్నత చదువులు చదివినా ఒళ్ళు వంచడానికి సిగ్గుపడలేదు ఆ యువకులు. వ్యవసాయం చేయాలనుకున్నా కాస్త డిఫరెంట్ గా ఉండాలనుకున్నారు. దీంతో తేనటీగల పెంపకాన్ని చేపట్టి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుల విజయగాథ మీకోసం.

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఎండీ. సల్మాన్ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎండి షుకూర్ లు చిన్నతరహా తేనెటీగల పెంపకం చేస్తున్నారు. తేనెటీగల నుంచి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ యువకులు 2019 లో హైదరాబాద్ లోని NRD సంస్థలో తేనె సాగుపై శిక్షణ తీసుకొని ధ్రువీకరణ పత్రం పొందారు. ఆ తరువాత కరోనా కారణంగా ఉపాధి దొరక్క ఇబ్బంది పడ్డారు. దీంతో తాము నేర్చుకున్న విద్యనే నమ్ముకుని స్వయంగా తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించారు. జీవనోపాధి పొందుతున్నారు. ముందుగా ఆరు బాక్సులతో తేనెటీగల పెంపకం ప్రారంభించిన ఈ యువకులు ఆశాజనకమైన ఆదాయం రావడంతో మరో 16 బాక్సులు తీసుకువచ్చి తేనెటీగల పెంపకాన్ని విస్తరించారు.

కృత్రిమంగా తయారు చేసిన తేనేకు మంచి డిమాండ్ ఉండటంతో యువకులు తేన టీగల పెంపకం పై దృష్టిసారించి లాభాల ఆర్జిస్తున్నారు. ఒక్క బాక్స్ కు సుమారు 8 వేల రూపాయల ఖర్చుతో ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలతో పాటు కులి ఈగలు వస్తాయి. స్థానికంగా ఉన్న ఆడవులు , పంట పొలాల్లో తేనెటీగలను పెంచుతున్నారు.

ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి. కులి ఈగ లు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్ర పరుస్తాయి. ఒక్కో రాణి ఈగ 1500 నుంచి 2000 గుడ్లను పెడుతుంది. ఒక్కో రాణి ఈగను రూ. 2వేలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసినట్లు యువకులు తెలిపారు. ఇది రెండేళ్ల పాటు జీవిస్తుందన్నారు. పూల తోటలు ఉన్న ప్రాంతాల్లో చేసే తేనెటీగల పెంపకం ద్వారా 10 నుంచి 15 రోజుల్లో ఒక్కో పెట్టె నుంచి 3 నుంచి 5 కిలోల తేనె లభిస్తుంది.

తేనె తుట్టెల సాగు ఒక చోట ఉండి చేసేది కాదని రైతులు తెలిపారు. తేనె తుట్టెల పెట్టెలను మూడు నెలలకొకసారి ఒక చోట నుండి మరొక చోటికి మారుస్తుంటామన్నారు. పువ్వుల్లో పూర్తి స్థాయి మకరందం తీసుకునేందుకు మూడు నెలల సమయం పడుతోండటంతో ఇలా ఒకచోట నుండి మరోచోటకి వీటిని తరలిస్తూంటారు.

తేనె సాగు ఈ ప్రాంతంలో రైతులకు ఓ కొత్త ప్రయోగమే అని చెప్పాలి. చెట్టు మీద సహాజంగా ఏర్పడే తేనే మాత్రం చాలా మందికి తెలుసు అయితే ఇప్పుడు ఈ యువకులు చేస్తున్న ఈ సాగుతో స్థానికంగా మరికొంతమంది యువకులు కూడా తేనెటీగల పెంపకం పై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కాస్త సహాయాన్ని అందిస్తే సాగుని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు ఈ యవకులు.

Full View


Tags:    

Similar News