Mushroom Cultivation: పుట్టగొడుగుల పెంపకం చక్కటి ఉపాధి మార్గం

Mushroom Cultivation: రోజూవారీగా మనం తీసుకునే ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు తప్పక ఉంటాయి.

Update: 2021-06-24 12:42 GMT

Mushroom Cultivation: పుట్టగొడుగుల పెంపకం చక్కటి ఉపాధి మార్గం

Mushroom Cultivation: రోజూవారీగా మనం తీసుకునే ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు తప్పక ఉంటాయి. వీటితో పాటే శాఖాహారంలో మాంసకృత్తులు అందించే మరొక ఆహారం పుట్టగొడుగులు. ఈ మధ్యకాలంలో పల్లెల్లో, పట్టణాల్లో చాలా మంది పుట్టగొడుగులను సీజన్‌తో సంబంధం లేకుండా పోషకాల ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో ప్రస్తుత తరుణంలో అధిక శాతం యువత స్వయం ఉపాధి పొందేందుకు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడుతున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో సేంద్రియ విధానంలో పెంపకాన్ని చేపట్టి అధిక ఆదాయాన్నిపొందవచ్చు. అయితే చాలా మందికి పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్నా సరైన అవగాహన లేదు. ఏ రకాలు సాగుకు అనుకూలము ఎలాంటి వాతావరణంలో పెంపకం చేపట్టాలి, పెట్టుబడి ఎంతవుతుంది, ఆదాయం ఎంత వస్తుందో తెలియదు. ఈ క్రమంలో పుట్టగొడుగుల పెంపకంలో రాణించాలనుకునేవారి కోసం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలోని హోంసైన్స్ శాస్ర్తవేత్త భాగ్యలక్ష్మీ సలహాలు, సూచనలను అందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు అధికంగా ఉంటుంది. కోత అనంతరం వచ్చే వరి గడ్డిపైనే పుట్టగొడుగుల పెంపకం జరుగుతుంది. అయితే మొక్కలకు నేల సారం ఎంత ముఖ్యమో పుట్టగొడుగులకు గడ్డి ఎంపిక అనేది అత్యంత కీలకమైన విషయం. గడ్డిని ఎంచుకునేప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని అంటున్నారు భాగ్యలక్ష్మీ. చీడపీడలు సోకని, కుళ్లిపోని తాజా గడ్డి పెంపకానికి అనుకూలమని అంటున్నారు. అదే విధంగా సేకరించిన గడ్డిని శుభ్ర పరుచుకోవడంలో , నిల్వ చేసుకునేప్పుడు మెళకువలను పాటించాలంటున్నారు.

అధిక పోషకాలు, ఔషధ విలువలు కలిగిన పుట్టగొడుగులు ఏడాది పొడవునా సహజంగా దొరకడం కష్టమని శాస్త్రవేత్త చెబుతున్నారు. అందుకోసమే కృత్రిమంగా ఇళ్లల్లో పెంచుకోవడం ఈ మధ్యకాలంలో అధికమైందని తెలిపారు.

చల్లని ప్రదేశంలో చిన్న గది ఉన్నా సులువుగా పుట్టగొడుగులను పెంచుకోవచ్చు. గదిలో 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత, 85 నుంచి 90 శాతం గాలిలో తేమ ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుందని భాగ్యలక్ష్మీ తెలిపారు. ప్రతి రోజు గదిలో తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మర్చి నుండి అక్టోబరు వరకు గల వాతావరణం పెంపకానికి చక్కగా అనుకూలిస్తుంది. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తగు జాగ్రత్తలు పాటిస్తే ఏడాది పొడవునా పుట్టగొడుగులను పెంచుకోవచ్చు.

పుట్టగొడుగుల పంటకాలం 60 రోజులు. మూడు సార్లు పంట కాపుకు వస్తుంది. 22 రోజుల్లోనే ఒక్కో బ్యాగు నుంచి రెండు నుంచి 4 కేజీల పుట్టగొడుగులు లభిస్తాయి. కేజీకి 200 రూపాయల చొప్పున అమ్ముకున్నా రైతుకు మంచి ఆదాయం లభిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్యకాలంలో ముత్యపు చిప్ప రకాలైన పుట్టగొడుగుల పెంపకంపై యువత, మహిళలు ఆసక్తి చూపుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఇప్పటికే ఈ రకాలపై అనేక ప్రయోగాలు చేసింది.

పుట్టగొడుగుల పెంపకంలో నాణ్యమైన తాజా స్పాన్ ఎంపిక అనేది ముఖ్యమైంది. ఐఐహెచ్‌ఆర్ బెంగుళూరు లో మదర్ కల్చర్ లభిస్తుంది. ఒకసారి మదర్ కల్చర్ తెచ్చుకున్నాక స్పాన్ ను రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. స్పాన్ తయారీకి సంబంధించి ఇప్పటికే కేవీకే అనేక వృత్తి విద్యా శిక్షణా తరగతులను నిర్వహించింది. ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తామని భాగ్యలక్ష్మి చెబుతున్నారు. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో సేంద్రియ విధానంలో పుట్టగొడుగులను పెంచుకుని సొంతంగా మార్కెట్‌ చేసుకోగలిగితే రైతు మంచి ఆదాయం ఆర్జించవచ్చని తెలిపారు. 

Full View


Tags:    

Similar News