రైతులను దారుణంగా దెబ్బ తీస్తున్న దళారులు

Update: 2020-08-25 11:06 GMT

Papaya Farmers facing Problems in Kadapa: బొప్పాయి రైతుకు దళారులు సహకరించడం లేదు. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన రైతులు దళారుల సిండికేట్ రూపంలో మరింత దగ పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల కడప జిల్లా బొప్పాయి రైతు నష్టాలపాలైతే ఇప్పుడు దళారుల సిండికేట్ రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీస్తొంది.

కడప జిల్లాలో బొప్పాయి పంటకు రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు పెట్టింది పేరు. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 22 వేల ఎకరాలకు పైబడి బొప్పాయి సాగవుతొంది. ఈ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ సుమారు 30 లారీల బొప్పాయి పంటను చెన్నై, ఢిల్లీ, ఆగ్రా, మధురై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాలకు ఎగుమతి చేస్తుంటారు. సాధారణంగా ప్రతి యేడాది జూలై మాసం నుంచి బొప్పాయి దిగుబడి వస్తుంది. ఒక ఎకరా సాగుకు సుమారు లక్ష ఖర్చు అవుతుంది. ఒక బొప్పాయి పిలక కొనాలంటే 20 రూపాయాల ధర పలుకుతుంది. ఎరువులు, సాగు ఖర్చులు ఇతరత్రా అన్ని ఖర్చులు కలిపి ఒక్కొ చెట్టుకు వంద రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆ విధంగా ఎకరాకు వెయ్యి చెట్లు నాటితే, ప్రతి చెట్టు 200 తక్కువ లేకుండా ఆదాయం ఇచ్చే కాయలు కాస్తుంది. దీంతో ఎకరాకు లక్ష ఖర్చు పెడితే సుమారు లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు ఆదాయం వస్తుంది.

అయితే ఈసారి కరోనా వల్ల రైతాంగానికి ఎన్నడు లేని కొత్త కష్టాలు ఎదురయ్యాయి. దిగుబడి మొదలైన నాటి నుంచి వ్యాపారులు, దళారులు సిండికేట్ గా మారి లాక్‌డౌన్‌ పేరిట కృత్రిమ సమస్యలను చెబుతూ ధరలను భారీగా తగ్గించేసారు. నగరాల్లో బొప్పాయికి మార్కెట్‌ లేదని, డిమాండ్‌ లేదని, రవాణా వ్యవస్థ సక్రమంగా లేదని, కాయలు ఎగుమతి చేయడానికి ఖర్చు ఎక్కువవుతుందంటూ రకరకాల సాకులు చెబుతున్నారు. మరో వైపు అదే పట్టణాలు, నగరాల్లో మాత్రం కాయల ధరలు భారీగానే ఉన్నాయి. ఫలితంగా 20 వేల ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. టన్ను 22 వేల రూపాయలు పలకాల్సిన బొప్పాయి, కేవలం 5 వేలు మాత్రమే పలకడంతో ఒక్కసారిగా వారి గుండె పట్టేసినట్లయింది.

అంతేకాకుండా ఈ యేడాది వేసవిలోను అకాల వర్షాలు పడటంతో పెద్ద ఎత్తున కాయలు నేల రాలిపోయాయి. చాలా చెట్లు నేలకొరిగిపోయాయి. దీంతో ఆదిలోనే రైతాంగానికి నష్టాల పోటు తప్పలేదు. దీంతో మిగిలున్న చెట్లను కాపాడుకుంటే పెట్టుబడులైన వస్తాయని రైతులు ఆశించారు. కానీ ఇప్పుడు మాత్రం దళారులు చేస్తున్న మాయాజాలం రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీస్తొంది. పంట బాగా దిగుబడి వస్తే కరోనా సమయంలో కలిగిన నష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్నారు రైతులు. అప్పో సప్పో చేసైనా రైతలు ఎకరాకు లక్ష దాకా ఖర్చు పెట్టారు. గతేడాది కొంత మేరా మంచి ధరలే రావడంతో రైతులు సంబరపడ్డారు. ఐతే ఈ ఏడాది పెట్టిన ఖర్చులు కూడా వచ్చేలా లేవని లబోదిబోమంటున్నారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించి తాము నష్టపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

Full View



Tags:    

Similar News