Natural Farming: ప్రకృతి సేద్యం వైపు యువతరం చూపు

Natural Farming: ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం చేయాలన్న ఆశ లేదు.

Update: 2021-07-08 10:17 GMT

Natural Farming: ప్రకృతి సేద్యం వైపు యువతరం చూపు

Natural Farming: ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం చేయాలన్న ఆశ లేదు. తోటి వారిలా లక్షల రూపాయల జీతం వచ్చే కొలువులు చేయాలన్న కోరిక కలుగలేదు. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించాడు. మార్కెట్‌లో లభించే రసాయనిక ఆహారంతో పొంచివున్న ప్రమాదాన్ని గుర్తించాడు. ఆరోగ్యమే మహాభాగ్యమనుకున్నాడు. అందుకు సేద్యమే ముద్దనుకున్నాడు. పూర్తి ప్రకృతి విధానంలో దేశీయ పంటలను పండిస్తూ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తు్న్నాడు మెదక్ జిల్లాకు చెందిన యువరైతు అరవింద్‌. సమీకృత ప్రకృతి సేద్యంలో విజయాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పెట్టుబడులు పెరిగి నష్టాలు ఎదురై అప్పుల ఊబిలో కూరుకుపోతున్న శ్రమజీవులు సాగును వీడుతున్న ప్రస్తుత తరుణంలో పూర్వపు విధానాలను అనుసరించి మళ్లీ మూలలను వెతుకుతూ సేద్యం వైపు అడుగులు వేస్తున్నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన అరవింద్ గౌడ్. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో నిపుణుల సలహాలతో ప్రకృతి సేద్యం చేస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మర్కెట్ లో లభించే రసాయనిక ఆహారంతో పొంచివున్న ప్రమాదాన్ని గుర్తించిన ఈ యువరైతు తనకున్న వ్యవసాయ భూమిలో దేశీయ విత్తనాలను వినియోగిస్తూ పూర్తి పూర్వకాలపు విధానంలో పంటలు పండిస్తున్నాడు. తోటి రైతుల మెప్పు పొందుతున్నాడు.

ఎంబీఏ చదువుకున్న అరవింద్ అదరిలా సాఫ్ట్‌వేర్ కొలువుల కోసం తాపత్రయపడలేదు. లక్షల్లో సంపాదించాలన్న ఆలోచన మదిలో మెదల లేదు. తన కుటుంబానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలన్నదే లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. అందుకోసమే సేద్యం వైపు అడుగులు వేసానంటున్నాడు ఈ యువరైతు. గత రెండున్నర ఏళ్లుగా 5 ఎకరాల్లో దేశీ వరితో పాటు వివిధ రకాల పండ్లను, కూరగాయలను సాగు చేస్తున్నాడు. దేశీ విత్తనాన్నే సాగుకు వినియోగిస్తున్నాడు.

కేజీ దేశీ విత్తనాన్ని వినియోగించి ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నాడు ఈ యువరైతు. నారాయణ కామిని, బహురూపి, కులకర్, కాలాబట్టి, మైసూర్ మల్లిక, నవారా, గోదావరి ఇసుకలు ఇలా వివిధ రకాల దేశీ వరి రకాలను పండిస్తున్నాడు. విత్తనాలను నాటుకునే పద్ధతిలోనూ పూర్వకాలపు పద్ధతులనే అనుసరిస్తున్నాడు. ఈ పద్ధతుల్లో మొదటి సంవత్సరం 18 నుంచి 20 బస్తాల దిగుబడి వచ్చిందంటున్నాడు అరవింద్. దీర్ఘకాలంలో 50 బస్తాల వరకు దిగుబడి రైతుకు అందుతుందని అంటున్నాడు. ప్రకృతి విధానంలో సాగైన పంట ఉత్పత్తులను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేయవంటున్నాడు ఈ రైతు.

తన వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటి వరకు యూరియా కానీ డీఏపీ కానీ వాడలేదు. రసాయనాల జాడ అస్సలు కనిపించదు. చీడపీడలు ఆశించినా వాటిని ప్రకృతి పద్ధతుల్లోనే నివారిస్తున్నాడు. ప్రత్యేకంగా దేశీయ గోవులను పెంచుతూ వాటి నుంచి వచ్చిన వ్యర్ధాలను సేకరించి పంటలకు కావాల్సిన ఎరువులను సిద్ధం చేసుకుంటున్నాడు. సమయానుకూలంగా వాటని మొక్కలకు అందిస్తున్నాడు. సాగులో విజయపథంలో దూసుకెళ్తున్నాడు.

ఒక్క ఆవుతో 30 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చునని అంటున్నాడు యువరైతు అరవింద్. ఆవు నుంచి వచ్చే వ్యర్థాలే పంటలకు అమృతాలంటున్నాడు. ఇది తెలియక చాలా మంది రైతులు కేవలం దిగుబడుల కోసం రసాయనాలు వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన పొలంలోనే ప్రత్యేకంగా ఎరువులను తయారు చేసుకుని వాటిని పంటలకు సమయానుకూలంగా అందిస్తున్నాడు. చక్కటి దిగుబడులను సాధిస్తున్నాడు.

అరవింద్ స్నేహితులు ఈ సాగు పద్ధతులకు ఆకర్షితులవుతున్నారు. అరవింద్ ను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తనతో పాటు మరి కొంత మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి నేలతల్లిని రసాయనాల బారి నుంచి కాపాడాలన్నదే తన లక్ష్యం అని అంటున్న అరవింద్‌ రైతుల వద్దకే నేరుగా వెళ్లి వారికి అవగాహన కల్పిస్తున్నాడు. 

Full View


Tags:    

Similar News