ఉన్నత చదువులు చదువుకున్నారు.. అయినా ఉద్యోగాల వైపు ఆసక్తి చూపలేదు..

Vegetable Garden: ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాల వైపు ఆసక్తి పోలేదు. ఒకరికింద ఉద్యోగిగా ఉండేకంటే తామే ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతో వ్యవసాయం వైపు అడుగులు వేశారు.

Update: 2022-01-05 07:59 GMT

ఉన్నత చదువులు చదువుకున్నారు.. అయినా ఉద్యోగాల వైపు ఆసక్తి చూపలేదు..

Vegetable Garden: ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాల వైపు ఆసక్తి పోలేదు. ఒకరికింద ఉద్యోగిగా ఉండేకంటే తామే ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతో వ్యవసాయం వైపు అడుగులు వేశారు. మొదట వరి సాగు చేశారు. అందులో కష్టనష్టాలే తప్ప లాభాలు లేవని గుర్తించి సామాజిక మాధ్యమాల ద్వారా కూరగాయల సాగు గురించి తెలుసుకున్నారు. ప్రయోగాత్మకంగా తమకున్న 20 గుంటల పొలంలో కూరగాయలను పండించి లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువ దంపతులు. రెండు నెలల్లోనే 2 లక్షల రూపాయల వరకు ఆదాయం పొంది తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. భావితరాలకు సేద్యంపైన ఆశలు చిగురించేలా వ్యవసాయం చేస్తున్న ఆ యువ రైతు దంపతులపై ప్రత్యేక కథనం మీకోసం.

మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి సమీపంలోని సోమ్లా తండాకు చెందిన యువ దంపతులు భుక్యా దేవేందర్, ఉమారాణీ లు డిగ్రీ వరకు చదువుకున్నారు. అందరిలా ఉద్యోగాల కోసం చూడకుండా తమకు తెలిసిన వ్యవసాయాన్నే ఉపాధిగా మలుచుకున్నారు ఈ దంపతులు. మొదట వరి సాగు చేసిన ఈ దంపతులు అందులోని సాదకబాధలను గుర్తించి సామాజిక మాధ్యమాలను అనుసరించి ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపారు. 20 గుంటల్లో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు మొదలు పెట్టారు. గత రెండేళ్లుగా కూరగాయలను సాగు చేస్తూ ఉద్యోగి మాదిరి ఆదాయాన్ని నిత్యం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

20 గుంటలను చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని బీర, బెండ, సొర, కాకర వంటి కూరగాయలను పండిస్తున్నారు. తీగజాతి కూరగాయల కోసం ప్రత్యేకంగా పందిరిని నిర్మించుకున్నారు. ప్రకృతి విధానాలను అనుసరిస్తూ పండిస్తున్న పంట కావడంతో నాణ్యమైన దిగుబడులు అందుకుంటున్నారు వీరు. మార్కెట్‌లోనూ మంచి ధర లభిస్తోందని కూరగాయల సాగు మొదలు పెట్టిన ప్రారంభంలోనే 2 లక్షల వరకు ఆదాయాన్ని పొందగలిగామని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ యువ రైతు దంపతులు.

గ్రామంలో ప్రకృతి విధానాలను అనుసరించి కూరగాయల సాగు చేసే రైతులు లేకపోవడం, స్థానికంగానే మార్కెట్ అందుబాటులో ఉండటంతో వీరికి కలిసివచ్చింది. అందుకే నిత్యం ఆదాయాన్ని పొందగలుగుతున్నామని రైతు చెబుతున్నారు. తోటి రైతులు సాగు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని దేవేందర్ తెలిపాడు. ఆసక్తి ఉన్న రైతులకు కూరగాయల సాగుపైన అవగాహన కల్పిస్తున్నాని చెప్పుకొస్తున్నాడు.

బీఎస్సీ వరకు చదువుకున్న దేవేందర్ భార్య ఉమారాణి కూడా సేద్యంలో చేదోడువాదోడుగా ఉంటోంది. ఇంటి పట్టునే ఉంటూ కూరగాయల సాగు ద్వారా లాభదాయకమైన ఆదాయం పొందడం ఎంతో ఆనందాన్ని అందిస్తోందని ఉమారాణి తెలిపింది. ఉద్యోగం చేసే అవసరం ఇకపై ఉండదని, కూరగాయల సాగు ఆ నమ్మకాన్ని కల్పిస్తోందంటోంది ఈ యువ మహిళా రైతు. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపైన రైతులు దృష్టిసారిస్తే లాభదాయకమైన ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Full View


Tags:    

Similar News