రైతులను ఆకర్షిస్తున్న మెట్ట వరి సేద్యం

Farmers: తెలంగాణలోనే తొలిసారిగా నూతన పద్ధతిలో వరిసాగుకు నల్లగొండ జిల్లా వేదికయింది.

Update: 2022-07-27 10:58 GMT

రైతులను ఆకర్షిస్తున్న మెట్ట వరి సేద్యం

Farmers: తెలంగాణలోనే తొలిసారిగా నూతన పద్ధతిలో వరిసాగుకు నల్లగొండ జిల్లా వేదికయింది. ప్రయోగాత్మకంగా గత ఏడాది 380 ఎకరాల్లో చేపట్టిన మెట్ట వరి సాగు విధానం విజయవంతమయ్యింది. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే ఈ విధనం రైతులను అమితంగా ఆకర్షించింది. దీంతో జిల్లా రైతులు పెద్ద ఎత్తున మెట్ట పద్ధతిలో వరి సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఈ వానాకాలం సీజన్‌లో పదివేల ఎకరాల్లో మెట్టవరి సాగు ప్రారంభమైంది. ఎరువులు, నీటి వాడకం తగ్గడం, అదే సమయంలో దిగుబడి పెరగడంతో కర్షకులు ఈ సాగు వైపు మక్కువ చూపుతున్నారు.

సంప్రదాయకంగా వరిని సాగుచేయాలంటే నారుపోసి, మడుల్లో నీటిని నింపి దమ్ము చేసిన తర్వాత బురద నీటిలో నాట్లు వేయ్యాలి. ఇందుకు నీటి వినియోగంతో పాటు పెట్టుబడి కూడా ఎక్కువే అవుతుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇవేవి లేకుండా సాగులో నీటి వినియోగాన్ని, పెట్టబడి ఖర్చులను తగ్గిస్తూ పర్యావరణ హితంగా మెట్ట పద్దతిలో వరి సాగును డాక్టర్ రెడ్డీస్ పౌండేషన్ వాతావరణ విభాగం ప్రయోగాత్మకంగా నల్లగొండ జిల్లాలో అమలు చేస్తోంది. ఈ పద్దతిలో ట్రాక్టర్ వెనకాల మల్టీ క్రాప్ ప్లాంటర్ పరికరాన్ని భిగించి భూమిలో విత్తనాలు వేసి వరిని సాగు చేస్తారు. గత వానాకాలం సీజన్ లో త్రిపురారం మండలంలో 380 ఎకరాల్లో ఈ పద్దతిలో వరిసాగు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది జిల్లాలోని 12 మండలాల్లో దాదాపు పది వేల ఎకరాల్లో మెట్ట పద్దతిలో వరి సాగు జరుగనుంది.

పిలిప్పైన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్ధ , ఇరి శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో డాక్టర్ రెడ్డీస్ పౌండేషన్ ఈ నూతన విధానం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్ల దిగుబడి పెరగడంతో ఈ ఏడాది చాలా మంది రైతులు ఈ విధానంలో సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. నాలుగైదేళ్లలో రాష్ట్రం మొత్తం ఈ విధానంలోనే రైతులు వరిసాగు చేసేలా కార్యచరణ రూపొందిస్తోంది.

జిల్లాలో 12 మండలాల్లో మెట్టవరి సాగు చేసేందుకు 2400 మంది రైతులు ముందుకు వచ్చారు. రైతులు, సాగు విస్తీర్ణం పెరగడంతో 48 మిషన్లు తెప్పించి రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు నాటే పరికరంతో గంటలో ఓ ఎకరం చొప్పున విత్తనాలు వెయ్యవచ్చు. యంత్రానికి సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్‌ ఎకరానికి వెయ్యి రూపాయిలు మాత్రమే రైతు నుంచి తీసుకుంటాడు. రైతుకు కొత్త టెక్నాలజీ దగ్గర చేయడం, మిథేన్ గ్యాస్ విడుదలను తగ్గించడం, వాతావరణాన్ని రక్షించడం, పంటల దిగుబడి పెంచాలన్న ఉద్దేశంతోనే కృషి చేస్తున్నామని రెడ్డీస్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పంట వేసిన దగ్గర నుంచి కోసే వరకు రైతులకు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తూ అన్నదాతలను ముందుకు తీసుకెళ్తామంటున్నారు.

మెట్ట వరి సాగుతో సేద్యంలో కూలీల సమస్య తీరుతోందంటున్నారు రైతులు. అంతేకాక ఒర్రలు తీయ్యనవసరం లేదని మందుల వాడకం చాలా వరకు తగ్గిందంటున్నారు. ఎకరానికి పదివేల వరకు ఖర్చు తగ్గించే ఈ విధానంలో పంట దిగుబడి పెరిగి ఆదాయం పెరుగుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News