Dragon Fruit Farming: వినూత్న సాగుకు శ్రీకారం చుడుతున్న గుంటూరు రైతు

Dragon Fruit Farming: తరతరాలుగా అదే వ్యవసాయం చేస్తున్నాం కాలం మారుతోంది మనమూ మారాలనుకున్నారు.

Update: 2021-10-04 09:51 GMT

Dragon Fruit Farming: వినూత్న సాగుకు శ్రీకారం చుడుతున్న గుంటూరు రైతు

Dragon Fruit Farming: తరతరాలుగా అదే వ్యవసాయం చేస్తున్నాం కాలం మారుతోంది మనమూ మారాలనుకున్నారు. అందరూ పండించే పంటే మనమూ పండిస్తే లాభమేంటని గ్రహించారు. కొత్త పంటలను సాగు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఏ పంట వేయాలి? ఎలా సాగు చేయాలి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టారు రైతు అలపర్తి నాగసాయి. ఒకసారి పంట వేస్తే దీర్ఘకాలం నాణ్యమైన దిగుబడి లాభదాయకమైన రాబిడిని అందించే పంట సాగుతో తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

అందరూ పండించే పంటలనే మనమూ పండిస్తే మన ప్రత్యేకత ఏమిటనుకున్నాడు గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన రైతు అలపర్తి నాగసాయి. మిగతా రైతులకు భిన్నంగా తనకున్న 6 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. అయితే ఇందు కోసం చాలా శ్రమించారు. ఏకంగా మూడేళ్లు పరిశీలన చేసి పొలాన్ని సాగుకు అనుకూలంగా మార్చుకుని మార్కెట్ గిరాకీని తెలుసుకుని స్థానిక పరిస్ధితులను గమనించి నారు మొక్కలను తెప్పించి నర్సరీలో అభివృద్ధి చేసి క్షేత్రం నిండా మొక్కలను నాటి గులాబీ పండ్ల రుచులను ప్రజలకు, సాగును రైతులకు పరిచయం చేస్తున్నారు నాగసాయి.

నాగసాయి గతంలో అనేక రకాల పంటలను సాగు చేశారు. అయితే అందులో లేని సంతృప్తిని ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ సాగు ద్వారా పొందుతున్నాని చెబుతున్నారు. తైవాన్ పింక్ రకాన్ని పండిస్తున్నారు ఈ రైతు. ఈ రకం నల్ల రేగడి నేలలకు అనువైందని చెబుతున్నారు. మిగతా రకాలతో పోల్చితే ఫంగల్ సమస్యలను పింక్ వెరైటీ తట్టుకుని నిలబడుతుందని నాగసాయి తెలిపారు. రసాయనిక ఎరువుల వాడకం లేకుండా పూర్తి ప్రకృతి విధానంలోనే పంట సాగు చేస్తున్నారు. ఆవులు, కోళ్ల వ్యర్థాలతోనే సొంతంగా ఎరువు తయారు చేసుకుని పంటకు అందిస్తున్నారు. నల్లచీమల సమస్య ఉన్నా వాటికి ప్రకృతి విధానంలో నియంత్రిస్తున్నాని రైతు చెబుతున్నారు. ప్రకృతి ఎరువుల వల్ల కాయ నాణ్యత బాగుండటంతో పాటు నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుందని రైతు తెలిపారు.

డ్రాగన్‌ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గరి నుంచి పోల్స్, సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు. నేలలో తేమ ఉంటే చాలు చక్కటి ఉత్పత్తి లభిస్తుంది. అయితే నేలలో నీరు నిల్వ ఉండకుండా రైతు జాగ్రత్త పడాలంటారు నాగసాయి. నీరు నిల్వ ఉంటే కాయ నాణ్యతపై ప్రభావం పడుతుందంటున్నారు. మొత్తంగా ఎకరం విస్తీర్ణానికి ఎంతలేదన్నా నాలుగున్నర నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుందని చెబుతున్న రైతు. రెండేళ్లలో పెట్టిన పెట్టుబడులతో పాటు లాభాలను రైతు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

పంట బాగుంది సరే మరి మార్కెటింగ్ పరిస్థితి ఏంటన్నది చాలా మంది ప్రశ్న. దీనికి చక్కటి వివరణ ఇస్తున్నారు ఈ రైతు. మంచి పోషకాలు కలిగిన డ్రాగన్‌ఫ్రూట్‌కు మార్కెట్‌లోనూ డిమాండ్ ఉందని. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఈ మధ్యకాలంలో డ్రాగన్‌ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఈ డిమాండ్ దృష్ట్యా ప్రతి రోజు భారత్‌కు వియత్నాం నుంచి 600 టన్నుల డ్రాగన్ పండ్లు దిగుమతి అవుతున్నాయి. దానిని బట్టి చూస్తే ఇక్కడి ఉత్పత్తి ఏ విధంగా ఉందో తెలుస్తోందంటున్నాడు నాగసాయి. ఈ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి సాధించి సూపర్ మార్కెట్‌లు, ఆన్‌లైన్ స్టార్స్‌లో విక్రయిస్తే రైతుకు తప్పక లాభాలు వస్తాయంటున్నారు. నాలుగైదు సంవత్సరాల తరువాత డ్రాగన్ ఫ్రూట్ కు మార్కెట్ చాలా బాగుంటుందని చెబుతున్నారు. 

Full View


Tags:    

Similar News