అపజయాలే అతని విజయానికి సోపానాలు

Korameenu Fish: అపజయాలే అతని విజయానికి సోపానాలు. చదివింది తక్కువే అయినా అనుభవమే అతనికి పాఠాలు నేర్పింది.

Update: 2022-04-17 12:00 GMT

అపజయాలే అతని విజయానికి సోపానాలు

Korameenu Fish: అపజయాలే అతని విజయానికి సోపానాలు. చదివింది తక్కువే అయినా అనుభవమే అతనికి పాఠాలు నేర్పింది. తాను ఎంచుకున్న రంగంలో ఎత్తు పల్లాలను సమంగా చూస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ యువరైతు. కొర్రమేను పెంపకంలో ఎన్నో మెళకువలను నేర్చుకొని ప్రస్తుతం పది మందికి సలహాలు ఇచ్చే స్ధాయికి స్వశక్తితో ఎదిగాడు. తాను ఎదగడంతో పాటు తోటివారికి ఉపాధి మార్గాన్ని చూపిస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు నల్గొండకు చెందిన యువరైతు మహ్మద్ మాజిద్. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ యువరైతు విజయగాథ మీ కోసం.

నల్గొండ సమీపంలోని నడ్డివానిగూడెంకు చెందిన మహ్మద్ మాజిద్ ఐటిఐ చదివాడు. అయితే ఉద్యోగం వైపు ఆలోచన పోనీయకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన చేపల పెంపకాన్ని చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తనకున్న 10 ఎకరాల్లో పొలంలో రెండు ఎకరాల్లో తెలంగాణ రాష్ట్ర చేప అయిన కొర్రమేను పెంపకం మొదలుపెట్టాడు. ప్రారంభంలో అవగాహన లేకపోవడంతో కాస్త తడబడినా , నష్టాలు ఎదురైనా వెనుతిరగలేదు. పట్టుదలతో పడిన చోటే లేవాలన్న సంకల్పంతో ముందడుగు వేశాడు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని, మెళకువలను పాటిస్తూ గత మూడేళ్లుగా చేపలను సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు మహ్మద్‌ మాజిద్‌.

చాలా మంది సాగుదారులు బొచ్చ, రవ్వ, రోహూ, కట్ల వంటి చేపల రకాల పెంకపకం వైపు మెగ్గుచూపుతారు. కొర్రమేను కొంత ఆర్ధిక భారంతో కూడి ఉంటుంది కాబట్టి అటుగా చూడరు. కానీ మాజిద్ మాత్రం కొర్రమేను పెంపకం ఎలాగైనా చేయాలనుకున్నాడు. అయితే మాజిద్‌కు చేపల సాగుపై ఎలాంటి అవగాహన లేదు. అయినా ధైర్యంతో 35 వేల పిల్లలతో అరెకరంలో పెంపకం ప్రారంభించాడు. ఏడాది కాలం ముగిసినా చేపల్లో ఎదుగుదల లేకపోవడంతో నష్టపోయాడు. ఆ తరువాత అనుభవం సంపాదించుకుని మెళకువలను తెలుసుకుని రెండు ఎకరాల్లో మూడు పాండ్లను ఏర్పాటు చేసుకుని వాటిలో కొర్రమేను సాగును కొనసాగించాడు.

ఎలాంటి నేలలో అయినా కొర్రమేను సాగు చేయవచ్చంటున్నాడు ఈ రైతు. అయితే చేప పిల్లలు మాత్రం మూడు నుంచి నాలుగు అంగుళాల సైజు ఉన్నవి ఎన్నుకోవాలంటున్నాడు. ఈ పిల్లలు 8 నుంచి 9 నెలల్లో కేజీపైన బరువు పెరుగుతాయంటున్నాడు. ఒక చేప కేజీ బరువుకు రావాలంటే కేజీ పైన ఫీడ్‌ను తింటుందని చెబుతున్నాడు. 130 రూపాయల ఫీడు ఖర్చు, 20 రూపాయలు మందులకు, మెయిన్‌టెనెన్స్‌కు 50 రూపాయల వరకు ఖర్చు పెడితే మొత్తం ఒక్కో చేపకు 200 రూపాయల పెట్టుబడి ఖర్చు అవుతుంది. మార్కెట్‌లో 350 రూపాయల వరకు అమ్మకుంటే రైతుకు లాభం దక్కుతుందటున్నాడు మాజిద్.

కొర్రేమేనుకు ఎక్కువగా నాలుగు రకాలు వ్యాధులు వస్తుంటాయి. చలికాలంలో నీటిలో లో పీహెచ్ పడిపోవడం వల్ల శరీరంపైన వైట్ స్పాట్ డిజీస్, ఫిన్ రెడ్ , గ్రిల్స్ ఇన్‌ఫెక్షన్, లివర్ ప్రాబ్లం వస్తుంటాయని మాజిద్ తెలిపాడు . చేపను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం వల్ల చాలా వరకు వ్యాధులను నియంత్రించవచ్చునని తెలిపాడు. పాండ్‌ల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు చేసుకోకపోతే కప్పలు, పాములు, తాబేళ్లు, పక్షులు వాటిని తీనేస్తుంటాయని ఈ విషయంలో రైతులు జాగ్రత్త వహించాలన్నారు.

కొర్రమేనులో 33 రకాలున్నాయని రాష్ట్రంలో మాత్రం నాటు, వియత్నాం వంటి రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటున్నాడు ఈ యువ రైతు. ఎకరానికి 13 లక్షలు ఖర్చు చేస్తే రెండింతల ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపాడు. ముఖ్యంగా నాణ్యమైన పిల్లలను వేస్తే నే ఈ కొర్రమేను సాగులో విజయం దక్కుతుందని మాజిద్ సూచిస్తున్నాడు. 

Full View


Tags:    

Similar News