Desi Hen Farming: జాతి కోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు

Desi Hen Farming: ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివాడు అక్కడే మంచి ఉద్యోగం సంపాదించాడు‌ నెలకు 2 లక్షలకు పైగానే జీతం.

Update: 2021-06-02 10:50 GMT

Desi Hen Farming: జాతి కోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు

Desi Hen Farming: ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివాడు అక్కడే మంచి ఉద్యోగం సంపాదించాడు‌ నెలకు 2 లక్షలకు పైగానే జీతం. అయినా ఇవేమి అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. స్వయం ఉపాధి పొందాలనే సదుద్దేశంతో స్వగ్రామం చేరుకున్నాడు. మొదట వ్యవసాయ అనుబంధ రంగమైన గొర్రెల పెంపకాన్ని ప్రారంభించాడు. కానీ అవగాహన లోపంతో అందులో అంతగా రాణించలేకపోయాడు. నష్టాలు వచ్చినా వెనకడుకువేయకుండా కోళ్ళ పెంపకంపైన దృష్టిసారించాడు. రెండేళ్ళలో పెట్టుబడి తిరిగి సంపాదించడమే కాకుండా ఇప్పుడు భావి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కోళ్ళ పెంపకంలో లాభాలు సంపాదించడమే కాకుండా ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడచ్చని నిరూపిస్తున్నాడు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన యువరైతు యవనీష్.

మాంసం అందించే కోళ్లే కాదు పందెం కోళ‌్లకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉందని గుర్తించాడు యవనీష్. ఆ డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే అమలులో పెట్టాడు. జాతి కోళ్ల పెంపకం ప్రారంభించాడు. కోడి పిల్లలను కొనడం దగ్గరి నుంచి వాటి పెంపకం ,ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలపైన అవగాహన పెంచుకున్నాడు. భీమవరం తో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఏడు రకాల జాతి కోళ్లను తీసుకువచ్చి వాటని అభివృద్ధి చేస్తున్నాడు. పిల్లలను ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్నాడు. లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

ఫామ్ ప్రారంభించిన మొదటి నెలలోనే ఎదురుదెబ్బ తగిలింది. కోళ్ల పెంపకం వాటి అమ్మకం మీద పెట్టిన శ్రద్ధ వాటి ఆరోగ్యంపై పెట్టకపోవడమే అసలు సమస్య అని గుర్తించాడు. ఇంగ్లీషు మందు కాకుండా సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా లభించే పదార్ధాలనే కోళ్లకు మందుగా వాడుతున్నాడు. సాధారణంగా ప్రతి రోజు అందించే దాణాతో పాటు సొంటి, అల్లం, కలబంద, నేల ఉసిరి, మునగాకు, వేపాకును వారానికి రెండు సార్లు అందిస్తున్నాడు. వేసవిలో పుచ్చకాయను దాణాగా ఇస్తున్నాడు. దీంతో గత రెండున్నర ఏళ్లుగా కోళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదంటున్నాడు ఈ యువరైతు. కోడి పిల్లల్లోనూ వ్యాధినిరోధక శక్తి పెరిగిందంటున్నాడు.

కోళ్ల పెంపకంలో దీర్ఘకాలంగా రాణించాలనుకునే వారు ఎక్కువ విస్తీర్ణంలోనే పెంపకం చేపట్టాలని సూచిస్తున్నాడు ఈ రైతు. ఎకరం విస్తీర్ణంలో రెండు లక్షల పెట్టుబడితో పెంపకం ప్రారంభించవచ్చంటున్నాడు. అయితే పెట్టిన పెట్టుబడి రావడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని చెబుతున్నాడు. ఆ తరువాత నెలకు ఎంతలేదన్నా డిమాండ్‌ను బట్టి 40 వేల నుంచి లక్ష వరకు ఆదాయం సంపాదించవచ్చని రైతు యవనీష్ చెబుతున్నాడు.

ప్రాంతాన్ని బట్టి అక్కడి డిమాండ్‌ను బట్టి కోళ్ల పెంపకం చేయాలంటున్నాడు ఈ రైతు. తద్వారా కోళ్ల పెంపకంలో మార్కెటింగ్ సమస్య తలెత్తదని సూచిస్తున్నాడు. పెంపకంపై ప్రారంభంలోనూ పూర్తి అవగాహన కలిగి చిన్నపాటి మెళకువలను, జాగ్రత్తలను తీసుకుంటే వందకు వంద శాతం కోళ్ల పెంపకంలో లాభాలు తద్యం అని అంటున్నాడు.

యవనీష్ ఆసక్తిని తండ్రి గుర్తించి అతడిని ప్రోత్సహిస్తున్నారు. ఈ రంగంలో రాణిస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువత కోళ్ల ఫామ్ పెట్టుకుంటే మంచి ఆదాయం లభిస్తుందని అంటున్నారు.

Full View


Tags:    

Similar News