టెన్త్ పరీక్షలు పాత పద్ధతిలోనే.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
టెన్త్ పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షా విధానంలో మార్పులు లేకుండా పూర్వ విధానమే కొనసాగనుంది.
Telangana Education Department Decides to Conduct 10th Exams in Old Format
తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, 80 శాతం మార్కులు ఎక్స్‌టర్నల్ పరీక్షలకు, 20 శాతం మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయించనున్నారు.
పాత విధానానికి తిరిగి అనుమతి
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. గత ఏడాది నవంబరులో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఇంటర్నల్ మార్కులను పూర్తిగా తొలగించాలని నిర్ణయించగా, తాజాగా జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (NCERT) వర్క్‌షాప్‌లో ఈ అంశంపై మళ్లీ చర్చ జరిగింది. దీనిపై పునరాలోచన చేసిన విద్యాశాఖ, పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించింది.
తాజా నిర్ణయానికి కారణం
ఇంటర్నల్ మార్కులు తొలగించే నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడం, అలాగే పాఠశాలల స్థాయి నుంచి సూచనలు అందడం విద్యాశాఖ నిర్ణయానికి దారితీసింది. దీంతో ఈ సంవత్సరం కూడా 80 మార్కుల రాత పరీక్ష, 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానమే కొనసాగుతుంది.
పరీక్షల నిర్వహణపై ఆదేశాలు
ప్రతీ ఏడాది మాదిరిగా పదో తరగతి పరీక్షలు మార్చిలోనే జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని RJD, DEOలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.