ప్రపంచానికి మనమే ఆశాకిరణం.. నైపుణ్యంలో మనమే టాప్‌

Update: 2018-05-08 09:00 GMT

ఆటోమేషన్ వల్ల.. ఉన్న ఉద్యోగాలు ఊడి పోతాయంటూ వార్తలు వస్తున్న సమయంలో.. ఓ నివేదిక తీపి కబురు అందించింది. 2030 లోగా.. మనదేశంలో అవసరానికి మించి నిపుణులు తయారవుతారని తెలిపింది. మానవ వనరులకు కొదువ లేని భారత్‌.. భవిష్యత్తులో ప్రపంచదేశాలకు దిక్సూచీగా మారబోతుందని.. స్పష్టం చేస్తోంది కోర్న్‌ ఫెర్రీ నివేదిక. భవిష్యత్‌ ప్రపంచానికి మళ్లీ మనదేశమే దిక్కవనుంది. రానున్న రోజుల్లో అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న దేశాల చూపు ఇండియావైపే ఉండనుంది. అన్ని దేశాలకు ఆశాకిరణంగా భారత్ మారబోతోంది. కోర్న్ ఫెర్రీ తన తాజా నివేదికలో ఈ అద్భుతమైన నిజాలను వెల్లడించింది. ప్రపంచలోని 20 కి పైగా దేశాలతో పోలిస్తే మనదేశంలో.. 2030 కల్లా అవసరానికి మించి 24.5 కోట్ల మంది నిపుణులతో కళకళలాడుతుందని.. కోర్న్‌ ఫెర్రీ తన నివేదికలో పేర్కొంది. కార్మికులు, ఉద్యోగులు అవసరానికి మించి అందుబాటులో ఉంటారని.. అంచనా వేసింది. ఆ యేడాదికి మానవ వనరులు దేశంలో పుష్కలమవుతాయని.. స్పష్టం చేసింది. ప్రపంచంలోని 20 అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలపై నిర్వహించిన అధ్యయన ఫలితాలను కోర్న్‌ఫెర్రీ విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో.. మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలిపింది. మానవ వనరులు లేక.. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందిపడే అవకాశాలున్నాయని సూచించింది. 2030 కల్లా ఆయా దేశాల్లో ఎనమిదిన్నర కోట్లకు పైగా మంది.. నిపుణుల కొరత ఏర్పడే అవకాశముందని తేలింది. దీంతో ఆ 20 దేశాలు.. సుమారు 567 లక్షల కోట్ల అదనపు ఆదాయాన్ని కోల్పోయే అవకాశముందని నివేదికలో వెల్లడించింది. భారత్‌, బ్రెజిల్‌, మెక్సికో, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్‌, ఇండోనేసియా, జపాన్‌, మలేసియా, సింగపూర్‌, థాయిలాండ్‌ తదితర దేశాల్లో కోర్న్‌ఫెర్రీ అధ్యయనం చేసింది. కేవలం వచ్చే ఆరేళ్లలోనే.. జనాభాలో మనదేశం చైనాను దాటి పోనుంది. ప్రపంచంలోనే నెంబర్ వన్ గా అవతరించనుంది. అప్పుడు భారతీయుల సగటు వయస్సు.. 31 యేళ్లే అని అంచనా వేసింది. అయితే మానవ వనరులు భారీగా పెరగనున్న నేపథ్యంలో.. వారిలో నైపుణ్యాలు పెంచడం, అందరికీ ఉపాధి కల్పించడం మనదేశానికి సవాళ్లుగా మారనున్నాయి. నైపుణ్య భారత్‌ వంటి పథకాలు తీసుకొచ్చినా.. మరింత మెరుగైన చర్యలు అవసరం అని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న మానవ వనరులకు సరిపడే స్థాయిలో ఉపాధి కల్పన లేకపోతే.. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే ముప్పుందని చెప్పుకొచ్చింది. అయితే రానున్న 12 ఏళ్లలో మనదేశంలో ఆర్థిక సేవల రంగంలో 11 లక్షలమంది, టెక్నాలజీ, మీడియా, టెలీకమ్యూనికేషన్ల రంగంలో 13 లక్షల మంది, తయారీ రంగంలో 24.4 లక్షల మంది నిపుణులు అవసరమైనదానికంటే.. ఎక్కువగా అందుబాటులోకి రానున్నారని తేల్చిచెప్పింది. మరోవైపు, భారత్‌ లాంటి మానవ వనరులు అధికంగా అందుబాటులో ఉండే దేశాలకు.. తమ ప్రధాన కార్యాలయాలు, కార్యకలాపాలను మార్చుకునేందుకు పలు సంస్థలు మొగ్గుచూపే అవకాశముంది. దీంతో ఆయా సంస్థలు తమ దేశాలను దాటి వెళ్లకుండా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని.. నివేదిక వెల్లడించింది.

Similar News