తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు బ్రేకులు

Update: 2018-01-30 06:53 GMT

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపడదామని కసరత్తు చేసిన సీఎం కేసీఆర్ ఆ ఆలోచన విరమించుకున్నారా..? భవిష్యత్‌లో మంత్రి  మండలి విస్తరణ లేనట్లేనా..? మంత్రి కావాలని కలలుగన్న రేసుగుర్రాల ఆకాంక్షలు నెరవేరే అవకాశం లేనట్లేనా..? ఇంతకీ కేసీఆర్ ఆలోచనలకు బ్రేక్ వేసిన అంశమేది..? మంత్రి వర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు..?    

టీఆర్ఎస్ అధికారం చేపట్టాక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు ఎడాపెడా గులాబీ తీర్థం ఇచ్చేశారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు గ్యారెంటీ అన్న ఒప్పందంతో విపక్ష పార్టీల నేతలంతా పొలోమని కారెక్కేశారు. నియోజకవర్గాల పెంపు ఉంటుంది అందర్నీ సంతృప్తి పరచవచ్చన్న ధీమానే ఇందుకు ముఖ్య కారణం. అందుకే టీఆర్ఎస్‌లోకి వస్తామన్న ప్రతి ఒక్కరికీ రెడ్ కార్పెట్ పరిచేశారు గులాబీ బాస్. ఇంతకాలం కేసీఆర్ అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం అసలు ఈ ప్రక్రియ మొదలు పెట్టనే లేదు. అందుకే కేసీఆర్‌కు వాస్తవం బోధపడినట్లుంది. కేంద్రం సీట్ల పెంపు వ్యవహారంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆయన ఆలోచనలు, ఆకాంక్షలకు బ్రేక్ వేసుకుంటున్నారు. 

నిజానికి కేబినెట్ పునర్వ్యస్థీకరణ కోసం కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారు. పైగా మహిళా ప్రాతినిధ్యం లేని కేబినెట్‌గా విమర్శలు ఎదుర్కోవడం కూడా మరో కారణం. మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించాలి, కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి. ఎంత మంది మహిళలకు అమాత్య పదవి కట్టబెట్టాలి. శాఖల కూర్పు ఎలా అనే అంశాలపై 10 రోజుల పాటు ఫాంహౌస్‌లో ఉండిమరీ కసరత్తు చేశారు. కానీ కేసీఆర్ అకస్మాత్తుగా తన ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఆశించి భంగపడినవారికంటే..పదవులు ఊడిన నేతలతో ఎక్కువ నష్టమని ఆయన భావించినట్లు సమాచారం. పైగా మంత్రి పదవులు కోల్పోయినవారు టికెట్లు రాని, పదవులు దక్కని నేతలతో జట్టుకడితే మరింత ప్రమాదం. అందుకే కొరివితో తలగోక్కోవడం ఎందుకన్న భావనతో పునర్వ్యస్థీకరణను మొత్తానికే మానుకున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

ఇప్పటికే కార్పొరేషన్ పదవులు దక్కని నేతలంతా అధినేత తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వీరి వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఎన్నికల నాటికి ఆ అసంతృప్తి బద్దలయ్యే అవకాశాలున్నాయి. అందుకే కేసీఆర్ తొందర పడకుండా అచితూచి అడుగులేస్తున్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులను అటకెక్కించడంతో పాటు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీ చేసి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సంతృప్తి పరచాలని యోచిస్తున్నారు. మొత్తానికి నియోజక వర్గాల పెంపు విషయంలో మోడీ , అమిత్ షా అనుసరిస్తున్న వ్యూహం కేసీఆర్‌‌కు చిక్కులు తెచ్చిపెడుతోంది.

Similar News