సీఎల్పీ నేత ఎవరు...పరిశీలనలో...

Update: 2018-12-13 04:25 GMT

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మహామహూలు మట్టి  కరవడంతో ప్రతిపక్ష నేత ఎవరనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతమున్న సీఎల్పీ నేత జానారెడ్డి ఓడిపోవడంతో కొత్త ప్రతిపక్ష నేత ఎవరనేదాని ఉత్కంఠ రేపుతోంది. సీఎల్పీ నేతకు కూడా పోటీ నెలకొనడంతో  ఎవరిని నియమిస్తారనే దానిపై జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. 

జోగులాంబ గద్వాల నుంచి ఆదిలాబాద్ వరకు హై స్వీడ్‌తో పరుగులు పెట్టిన కారు ధాటికి కాంగ్రెస్‌ కుదేలయ్యింది. దశాబ్దాల నుంచి ఓటమెరుగని వీరులుగా గుర్తింపు తెచ్చుకున్న కాకలు తీరిన యోధులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. గత శాసనసభలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొంటూ పంచ్ డైలాగులతో మంత్రులను ముప్పుతిప్పులు పెట్టిన డీకే అరుణ,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సంపత్ కుమార్‌, వంశీ చంద్‌ రెడ్డిలు ఈ సారి పరాజయం పాలయ్యారు. దీంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. 

గత సభలో కీలకపాత్ర పోషించి ప్రస్తుతం గెలిచిన వారిలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాత్రమే ఉన్నారు.  తాజాగా గెలిచిన వారిలో మంచి వాగ్ధాటి కలిగిన నేతలుగా శ్రీధర్ బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావులు, జగ్గారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు ఉన్నారు. అయితే వీరిలో ఎవరికి సీఎల్పీ పదవి ఇవ్వాలనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. 

ఈ ఎన్నికల్లో పార్టీకి కీలకమైన సామాజిక వర్గం దూరమైందని భావిస్తున్న నేతలు తమకే పదవి ఇవ్వాలంటూ కోరుతున్నారు. అయితే భవిష్యత్ అవసరాల దృష్యా మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా జోరుగా నడుస్తోంది. కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొన్న నేతల్లో మల్లు భట్టి విక్రమార్క  అగ్రస్ధానంలో ఉండటం సామాజిక సమీకరణాల దృష్యా కూడా ఈయనకే సీఎల్పీ అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌ కూడా సీఎల్పీ నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇతర నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో  సీఎల్పీ లీడర్‌‌ ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.  
 

Similar News