ఆ హామీలు ఏమయ్యాయి.. సీఎంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఫైర్

Update: 2018-09-02 15:51 GMT

 ఇవాళ(ఆదివారం) జరిగిన టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శలు కురిపించారు. ప్రగతి నివేదన సభ తుస్సుమందని అయన వ్యాఖ్యానించారు. అది ప్రగతి నివేదన సభ కాదని ప్రజల ఆవేదన సభ అని ఎద్దేవా చేశారు. ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. ప్రజల సొమ్ము విచ్చల విడిగా ఖర్చు చేసి బలవంతగా బస్సులను సభకు తరలించారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, ఇంటికో ఉద్యోగం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ వంటి హామీల గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదని ప్రశ్నించారు. అలాగే కరెంట్‌ విషయంలో కేసీఆర్‌ మళ్లీ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. పదే పదే తాము అధికారంలోకి వచ్చిన తరువాతే కరెంటు కష్టాలు తీరాయంటున్నా సీఎం.. జైపూర్‌, భూపాలపల్లిలో పవర్‌ ప్లాంట్‌లు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించినవి కాదా అని ప్రశ్నించారు. అలాగే జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు సరిగా లేదన్న ఉత్తమ్.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని సభకు వస్తే ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో జీహెచ్‌ఎంసీ అధికారులు కాంగ్రెస్ ప్లెక్సీలను తొలగించారని.. కానీ ఇప్పుడు అదే అధికారులు దగ్గరుండి కటౌట్లను కాపాడారని ఆరోపించారు.

Similar News