అప్పు కట్టలేదని.. భార్య, పిల్లల్ని లాక్కెళ్లాడు...2 నెలలుగా వ్యాపారి చెరలోనే..

Update: 2018-07-24 08:00 GMT

మంచిర్యాల జిల్లాలో మరో దారుణం జరిగింది. అప్పు చెల్లించలేదన్న కారణంతో ఓ ఫైనాన్షియర్ పైశాచికత్వానికి తెగబడ్డాడు. అప్పు తీసుకున్న వ్యక్తి  భార్యాబిడ్డల్ని కిడ్నాప్‌ చేసి రెండు నెలలుగా తన ఇంట్లో బందీలుగా పెట్టుకున్నాడు. బాధితుడు మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన హనుమంతు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ నాలుగేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ఆస్పత్రి ఖర్చు కోసం చిత్తాపూర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి ఎండీ సందాని దగ్గర 20వేల రూపాయలు అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో అప్పు తీర్చకపోవడంతో రెండు నెలలక్రితం హనుమంతు భార్యా, ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లిన సందాని వారిని మందమర్రి దీపక్‌నగర్‌లో బంధించాడు. ఇంటిని అద్దెకు తీసుకొని దాచిపెట్టాడు. 

కొన్నిరోజులుగా తన భార్యాబిడ్డల ఆచూకీ కోసం గాలిస్తోన్న హనుమంతు చివరికి మందమర్రి దీపక్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వడ్డీ వ్యాపారి సందాని అడ్డుకున్నాడు. తనకు ఇవ్వాల్సిన 20వేలు ఇస్తేనే పంపిస్తానని చెప్పాడు. దాంతో మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌ను కలిసిన హనుమంతు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతికష్టంమీద తన కుమారుడు సుచిత్‌ను తీసుకొని వచ్చానన్న హనుమంతు తన భార్యా, కూతుర్ని ఫైనాన్షియర్‌ బందీ నుంచి విడిపించాలని కోరాడు. హనుమంతు ఫిర్యాదుపై స్పందించిన జేసీ చర్యలు తీసుకోవాలంటూ స్థానిక తహశీల్దార్‌, ఎస్సైకి ఆదేశించారు.
 

Similar News