పథకాల అమలు తీరుపై సీఎం అసంతృప్తి

Update: 2018-04-17 06:37 GMT

దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించలేదనేది మన సామెత. ఇది ప్రభుత్వ పథకాల విషయంలో సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వం ఎంత మంచి పథకాలు రూపొందించినా...క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఎంత మందికి లబ్ది చేకూరుతుందో అనుమానమే. పైగా అవినీతి బంధుప్రీతి మనకు మామూలే. పథకం ఎంత గొప్పదైనా.. ప్రజలకు చేరువైనప్పుడే ప్రయోజనం. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..పథకాల అమలుపై దృష్టిసారించారు. 

కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సరికొత్త పథకాలు అమలు చేస్తోంది. అసరా, కళ్యాణ లక్ష్మి, వ్యవసాయినికి 24 గంటల కరెంటు, అమ్మఒడి, కేసీఆర్ కిట్స్, ఒంటరి మహిళలకు భృతి, దళితులకు మూడెకరాల భూమి, నేతన్నకు సాయం, మైనార్టీ, బీసీ రెసిడెన్సియల్ స్కూల్స్, గొర్రెలు, చేపల పంపిణీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. అయితే ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ కావడం లేదనే ఆరోపణలున్నాయి. అందుకే పథకాల అమలు తీరుతెన్నుల గురించి తెలుసుకునేందుకు సర్వేలు చేయించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.

మిషన్ కాకతీయ, భగీరథ, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, ఎస్సీ ఎస్టీ, బీసీ వ్యక్తిగత సబ్సిడీ రుణాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో పని చేయడం లేదనే విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భావనలో సీఎం ఉన్నారు. సాధారణ ఎన్నికలు  దగ్గర పడుతున్న నేపథ్యంలో పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రైయివేట్ సంస్థల ద్వారా సర్వేలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరటం ఖాయమని కేసీఆర్ యోచిస్తున్నారు. సర్వేల ద్వారా వచ్చే సూచనలు, తెలిసే తప్పొప్పుల ఆధారంగా పథకాల్లో లోపాలను సరిచేసి అవి మరింతగా ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళికలు రూపొందించాలనేది సీఎం ఆలోచనగా ఉంది. 
 

Similar News