వన్‌లాక్‌ ఎప్పుడిస్తావ్‌... దళారీకి తహిశీల్దార్‌ ఫోన్‌

Update: 2017-12-27 13:26 GMT

వరంగల్‌ జిల్లా పర్వతగిరి తహసిల్దార్‌ విజయలక్ష్మీ దళారితో మాట్లాడిన ఫోన్‌ ఆడియో విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన భూ శుద్ధీకరణలో ఒక దళారితో చేసిన డీలింగ్‌ ఆడియో టేప్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఏకంగా ఏజెంట్లను పెట్టేసి తహసీల్దార్‌ ఇంట్లోనే దందాకు తెరలేపిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ రికార్డులు చేయించుకునేందుకు వస్తున్న వారి నుంచి డబ్బుల వసూలు చేస్తున్నఆడియో హాట్‌టాపిక్‌గా మారింది. 

హలో... నిన్న నువ్వు ఇచ్చిన పహాణీలన్నీ అయిపోయాయ్‌.... అందులో ఒకటే పెండింగ్‌లో ఉంది. పాస్‌బుక్‌లు ఇస్తే వన్‌లాక్‌ ఇస్తా అన్నావ్‌... ఎప్పుడిస్తావ్‌....!! ఇదీ పర్వతగిరి తహసీల్దార్‌ విజయలక్ష్మి... దళారీ మధ్య సాగిన సంభాషణ. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... ఎంతోమంది మధ్యవర్తుల ద్వారా లక్షల్లో దండుకుంటూ విజయలక్ష్మి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహశీల్దార్‌ విజయలక్ష్మికి, దళారికి మధ్య నడిచిన ఫోన్‌ ఆడియో ఏంటో పైన వీడియోలో వినండి. 

తహశీల్దార్‌ విజయలక్ష్మి ఇంటి నుంచే పనులు చక్కబెడుతూ భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పర్వతగిరిలో పనిచేస్తున్న విజయలక్ష్మి హన్మకొండలో ఉంటున్నారు. అవినీతి బాగోతాన్ని సాగించడానికి ఆమె తన ఇంటినే అడ్డాగా చేసుకొని వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. భారీగా డబ్బులు దండుకొని మండలంలోని సుమారు 40 మంది రైతులకు పాస్‌ బుక్‌లు ఇచ్చారన్న ఆరోపణలు ఈ తహశీల్దార్‌పై ఉన్నాయి. 

ప్రస్తుతం భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం భూములున్న రైతులందరికీ ఉచితంగా డిజిటల్‌ పాస్‌బుక్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అప్పటి వరకు పాస్‌బుక్‌ల జారీని నిలిపివేసింది. కానీ తహశీల్దార్‌ విజయలక్ష్మి మాత్రం చేతివాటం ప్రదర్శిస్తూ రికార్డులను తారుమారు చేస్తూ పాత పాస్‌ పుస్తకాల్లోనే పేర్లు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News