బాల్ ట్యాంపరింగ్ లో అడ్డంగా బుక్కైన ఆసీస్‌

Update: 2018-03-25 06:22 GMT

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మూడో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం రాజుకుంది. ఈ వివాదానికి ఆసీస్‌ ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌ కారకుడయ్యాడు. మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ కొనసాగుతుండగా తన ప్యాంటు జేబులో నుంచి పసుపు రంగు వస్తువుతో బంతిపై రుద్దడం వివాదానికి తెరలేపింది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆస్ట్రేలియా జట్టు ఈసారి బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ లో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ కేమరాన్ బాన్ క్రాఫ్ట్ మైదానంలో బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పసుపు రంగు చిప్ లాంటి పరికరంతో బంతి ఆకారాన్ని మారుస్తూ కెమెరాలకు చిక్కాడు.

బాల్  ట్యాంపరింగ్ పై ఫీల్డ్  అంపైర్లకు ఫిర్యాదు రావడంతో బాన్ క్రాఫ్ట్ ను పిలిచి వివరణ కోరారు. కానీ అతడు తన జేబులో నుంచి సన్ గ్లాసెస్  కవర్ ను చూపించడంతో అంపైర్లు ఆటను కొనసాగించారు. మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా బాల్ ను ట్యాంపరింగ్ చేస్తున్నట్టు పదేపదే టీవీల్లో ప్రసారం కావడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోవైపు బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన బాన్ క్రాఫ్ట్ పై క్రికెటర్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. డేల్ స్టెయిన్, షేన్ వార్న్, ఆడమ్ కోలిన్స్, సిమన్ హార్మర్ వంటి వాళ్లు ఆసీస్ తీరును ఎండగట్టారు. దీంతో తప్పించుకునే మార్గం లేక ఇరుక్కుపోయిన ఆసీస్ కెప్టెన్ స్మిత్ రంగంలోకి దిగాడు. బాల్ ను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించినట్టు నిర్లజ్జగా అంగీకరించాడు. దీంతో స్పందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్  బాన్ క్రాఫ్ట్ పై ఒక మ్యాచ్ నిషేధంతోపాటు మ్యాచ్ ఫీజులో వందశాతం కోత విధించింది.  

Similar News