పోలీసోడు కాదు పోలీస్

Update: 2018-02-06 05:47 GMT

పల్లెల్లో పోలీసులంటే సహజంగానే భయం ఉంటుంది. వారు ఊళ్లొకి వచ్చారంటే ఆరోజు ఎవరో ఒకరికి మూడిందనే భావన ప్రజల్లో స్థిరపడింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. పోలీసులంటే కాఠినత్వమే కాదు.. మానవీయతకు మారుపేరు కూడా అని రుజువు చేస్తున్నాడు జోగులాంభ గద్వాల జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‍. ప్రజలతో మమేకమవుతూ పల్లెల్లో సమస్యల పరిష్కారానికి కూడా కృషిచేస్తున్నాడు. 

ఇతని పేరు నజీర్‍. వనపర్తి జిల్లా పిన్నంచర్లకు చెందిన నజీర్‌ ప్రస్తుతం జోగులాంభ గద్వాల జిల్లా ధరూర్‌ పోలీస్టేషన్‍లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నజీర్‍ ని ఓ కానిస్టేబుల్‍ అనడం కన్నా ఆయనో సామాజిక కార్యకర్యకర్త అంటే సరిగ్గా సరిపోతుంది. ఎక్కడా ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నానంటూ మరు క్షణం నజీర్‍ అక్కడ వాలిపోతాడు. తన వంతు సహాయం చేసి, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు. ఆయన స్పందిస్తున్న తీరు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఏమాత్రం సమయం దొరికినా నజీర్‌, తాను విధులు నిర్వర్తించే ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తారు. ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటాడు. వాటిని పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు, ఇతర శాఖల సహకారం తీసుకుని ముందుకు సాగుతాడు. ఎవరైనా అనాధలు ఆయన దృష్టికి వస్తే, వారిని తానే స్వయంగా అనాధ ఆశ్రమానికి తరలిస్తాడు. ఇక మతి స్థిమితం లేని వారు తారసపడితే వారిని  గుండు గీయించి, శుభ్రంగా తల స్నానం చేయించి.. కొత్త దుస్తులు వేసి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తాడు. 

ఇటీవల బోరుబావుల్లో చిన్నపిల్లలు పడిపోతున్న నేపథ్యంలో నజీర్‍ చేపట్టిన ప్రచారం పలువురిని కదిలించింది. ధరూరు, ఆత్మకూరు మండలాల్లో రైతులు, స్థానిక యువకులతో కలిసి 50కి పైగా నోర్లు తెరచిన బోరు బావులను పూడ్చివేయించాడు. అంతేకాదు, ఉప్పేరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నాడు. ఎక్కడ బాలకార్మికులు కనిపించినా వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడిలో చేర్పిస్తున్నాడు. ఇలా సామాజిక భాద్యతను మోస్తూ ధరూర్‌ మండలంలో చాలామందితో శభాష్‍ అనిపించుకుంటున్నాడు నజీర్. అనాథలైన వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారుల విషయంలో నజీర్ స్పందిస్తున్న తీరు గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై నజీర్‍కు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. 

Similar News