బస్సుతో కారుకు చెక్?

Update: 2018-03-29 05:57 GMT

మూడు వారాల బ్రేక్ తర్వాత మలివిడత ప్రజా చైతన్య బస్సుయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ప్రజల్లోకి వెళ్లి  ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని హస్తం పార్టీ భావిస్తోంది. రెండోవిడత ప్రజా చైతన్య బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జరిగే మలి విడత బస్సు యాత్ర  ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు కొనసాగుతుంది.

ఏప్రిల్ 1 సాయంత్రం అరుగంటలకు రామగుండం నియోజకవర్గంలో బస్సుయాత్ర మొదలవుతుంది. 2న పెద్దపల్లిలో, 3న మంథనిలో, అదేరోజు సాయత్రం 6 గంటలకు భూపాల్‌పల్లిలో, 4న స్టేషన్‌ ఘన్‌పూర్, పాలకుర్తిలో, 5న నర్సంపేటలో, 6న పరకాల, వరంగల్‌లో, 7న ఇల్లెందు, పినపాకలో, 8న డోర్నకల్, మహబూబాబాద్‌లో సభలు నిర్వహిస్తారు. 9న భద్రచలంలో దేవాలయంలో దైవ దర్శనం అనంతరం వెంకటాపురంలో, ములుగులో, 10న వర్ధన్నపేటలో సభలు ఉంటాయి. మూడు రోజుల తాత్కాలిక విరామం తర్వాత తిరిగి బస్సుయాత్ర మొదలవుతుంది. 

అసెంబ్లీ, కౌన్సిల్ నుంచి కాంగ్రెస్ సభ్యులను గెంటేసి ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం.. బడ్జెట్ కేటాయింపులు- అవి అమలు కాకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. వీటితో పాటు రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగడతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే రైతులకు 2 లక్షల రుణమాఫీ, పంటలకు రుణమాఫీ వంటి అంశాలు ప్రస్తావించనున్నారు. మొదటి విడతలో జరిగిన చిన్నచిన్న పొరపాట్లు ఈ సారి జరగకుండా చూడాలంటున్నారు కార్యకర్తలు. ముఖ్యంగా నాయకులు యాత్రలో ఐకమత్యంగా ఉండాలని కోరుతున్నారు. 

Similar News