శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు

Update: 2018-12-24 06:05 GMT

శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయ్యప్పస్వామి ఆలయానికి  తమిళనాడు నుంచి వచ్చిన మహిళా భక్తుల బృందాన్ని భక్తులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసులు మొహరించారు. ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. 

శబరిమలలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమిళనాడు నుంచి వచ్చిన 11 మంది మహిళా బృందం పంబ బేస్ క్యాంప్ కు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మహిళా హక్కుల కోసం పోరాడే మణితి సంస్థకు చెందిన మహిళా బృందం మదురై నుంచి రోడ్డు మార్గం మీదుగా పంబకు చేరుకున్నారు. వీరితో పాటు మరో ఐదుగురు మహిళలు వేరే మార్గం నుంచి పంబకు చేరుకున్నారు.  

మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటి నుంచి శభరిమలలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. నవంబర్ 17న ఆలయం తిరిగి తెరిచినప్పటి నుంచి పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు ప్రభుత్వం అంక్షలు విధించింది. ఈ నేథ్యంలో మహిళలు ఆలయ సందర్శనకు రావడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలు కొండ ఎక్కకుండా అడ్డుకుంటామని ఆందోళనకారులు చెబుతుంటే దర్శనం చేసుకుంటామని మహిళా భక్తుల బృందం భీష్మించుకుని కూర్చున్నారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు మహిళా భక్తులు. 50 ఏళ్లు నిండిన మహిళలనే ఆలయంలోకి అనుమతిస్తామని అంటున్నారు పోలీసులు. 

శబరిమల సన్నిధానం పరిధిలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదంటూ అధికారులు ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో 144వ సెక్షన్ విధించారు. ఈ నెల 27వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని చెబుతున్నారు. ఆలయ కార్యకలాపాలు పర్యవేక్షణకు కేరళ హైకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం అమలు చేయనుంది. 
 

Similar News