కొండగట్టు ఘాట్‌రోడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం...32 మంది మృతి

Update: 2018-09-11 07:22 GMT

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. సుమారు 60మందితో ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టులోని ఘాట్ రోడ్డులోకి వచ్చిన వెంటనే, ఒక్కసారిగా బోల్తా పడింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే ఘాట్ రోడ్డు నుంచి బస్సు పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతంలో పడిపోయింది. సుమారు 25మంది అక్కడిక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
 
కొండగట్టులో బస్సు ప్రమాదం విషయం తెలియడంతో.. సీఎం కేసీఆర్ వెంటనే, జిల్లా అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సీఎం ఆదేశాలతో  జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. బస్సు బోల్తా ప్రమాదానికి గల కరణాలు తెలియాల్సి ఉంది. మార్గం మధ్యలో బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందా.. లేక, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా అనేది తెలియాల్సి ఉంది. 

Similar News