నాలుగో తరగతి విద్యార్థిని కొట్టి చంపిన పదో తరగతి విద్యార్థి

Update: 2018-10-24 05:25 GMT

ఖమ్మం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ వసతి గృహంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. విద్యార్ధుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతుంటే అధ్యాపకులు, సిబ్బంది ఎం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఖమ్మం గిరిజన పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి, అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జోసెఫ్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన పదో తరగతి విద్యార్ధి జోసెఫ్‌ను కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హాస్టల్ వార్డెన్ లేని సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. వార్డెన్‌ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సీసీ పుటేజ్‌ ఆదారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లి దండ్రులు వచ్చేసరికి జోసెఫ్ మృతదేహాన్ని మార్చరికి తరలించడంపై బంధువులు ఆందోళనకు దిగారు పాఠశాల ముందు బైఠాయించారు.  తల్లి దండ్రులు లేకుండా మృతదేహాన్ని తరలించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. జోసెఫ్ మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల దగ్గర ఆందోళన నిర్వహించాయి. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. విద్యార్ధుల మధ్య ఘర్షణ జరుగుతుంటే హాస్టల్ అధ్యాపకులు, సిబ్బంది ఏం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. జోసెఫ్ బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలతో ఖమ్మం ప్రభుత్వ గిరిజన పాఠశాల దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి మృతిపై ఆందోళన నేపధ్యంలో హాస్టల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Similar News