కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఊహించని షాక్‌ ఇచ్చిన రాహుల్ గాంధీ

Update: 2018-01-08 07:12 GMT

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు రాహుల్ గాంధీ. రెండేళ్లుగా పీసీసీ అధ్యక్ష పదవిపై కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై అవకాశం దొరికినపుడల్లా విమర్శలు చేస్తున్నారు. తమకు పదవి కట్టబెడితే పార్టీని అధికారంలోకి తీసుకొస్తామంటూ బహిరంగంగా ప్రకటన చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డినే కొనసాగిస్తూ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఖంగుతిన్నారు.

ఉత్తమ్ నాయకత్వంలో పనిచేయం ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ అధికారంలోకి రాదు ఉత్తమ్‌ను చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా ? అంటూ ఉత్తమ్‌పై టైం దొరికినపుడల్లా విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి బ్రదర్స్‌. టీపీసీసీ బాధ్యతలు తమకు అప్పగిస్తే పార్టీని వంద సీట్లలో గెలిపిస్తామని బహిరంగ ప్రకటనలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలే తమకు అధిష్టానమంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చులకన చేసి మాట్లాడారు. ప్రస్తుతం బ్రదర్స్‌ దూకుడుకు కళ్లెం వేసేలా పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌లో నైరాశ్యం ప్రారంభమయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి రావడంతో బ్రదర్స్‌ కొత్త సమస్య వచ్చింది. 

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యాక పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఉత్తమ్‌కు కట్టబెట్టారు. కేంద్రంలో ఉత్తమ్‌కు ఉన్న పరిచయాలు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఉత్తమ్‌కు రాజకీయ శత్రువులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తూ వచ్చారు. ఉత్తమ్‌‌కుమార్‌ రెడ్డి ఏ కార్యక్రమానికి హజరయ్యాడంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌ దూరంగా ఉండేవారు. దీనికి జీహెచ్ఎంసీ, వరంగల్, నారాయణఖేడ్‌, మెదక్‌ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిదంటూ బహిరంగ విమర్శలు చేశారు. 

ఇటీవల మునుగోడులో జరిగిన పాల్వాయి సంస్మరణ సభలో‌ ఉత్తమ్‌తో పాటు కొప్పులరాజు, మధుయాష్కీ, సర్వే సత్యనారాయణ, హనుమంతరావులు పాల్గొన్నారు. పాల్వాయి స్రవంతికు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించారు. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో సభ నిర్వహించి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలంతా స్రవంతికి మద్దతు తెలిపారో లేదో వెంటనే ధిక్కారస్వరం వినిపించారు బ్రదర్స్‌. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించడంతో బ్రదర్స్‌ నెక్స్ట్‌ స్టెప్ ఏంటన్ని ఆసక్తికరంగా మారింది.

Similar News