విరసం నేత వరవరరావును పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో.. హైదరాబాద్‌లోని వరవరరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. దాదాపు ఏడు గంటల పాటు విచారించిన తర్వాత వరవరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు పుణె పోలీసులు ఈ ఏడాది జూన్‌లో గుర్తించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీపెరంబదూర్‌లో ఎల్‌టీటీఈ ఆత్మాహుతిదాడితో హత్య చేసిన రీతిలోనే మోదీని కూడా అంతమొందించాలని మావోయిస్టు సానుభూతిపరుల వద్ద లభ్యమైన ఓ లేఖలో ఉన్నట్లు తేలింది. కాగా వరవరరావు అరెస్టుపై ప్రజాసంఘాల నేతలు భగ్గుమన్నారు. కేవలం ఆరోపణలతో విరసం నేతను అరెస్టు చేయడం దారుణమన్నారు.