గ్యాస్ తరహాలో విద్యుత్ సబ్సిడీకి నగదు బదిలీ

Update: 2018-01-30 07:41 GMT

గ్యాస్ సిలిండర్ తరహాలోనే  ఇకపై విద్యుత్ సబ్సిడీ సొమ్మును నేరుగా వినియోగదారుల ఖాతాలకు జమ చేసేలా చట్ట సవరణలకు రూపకల్పన జరుగుతోంది. 2017 విద్యుత్ చట్ట సవరణ బిల్లును లోక్‌సభ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీని పాక్షికంగా ప్రైవేటీకరించిన కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు ద్వారా పూర్తి ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకుంటోంది. అయితే, ఈ విద్యుత్ సబ్సిడీ నగదు బదిలీని ప్రయోగాత్మకంగా తెలంగాణలో అమలు చేయాలనుకుంటోంది కేంద్రప్రభుత్వం. 

విద్యుత్ సరఫరాలో కీలకంగా ఉండే డిస్కంలకు  అధికారాల్ని కుదిస్తూ ప్రైవేటు డిస్కంల ఏర్పాటుకు 2017 విద్యుత్ చట్ట సవరణ బిల్లులో చోటు కల్పించారు. ఇప్పటివరకూ ప్రభుత్వరంగ డిస్కంలకు ఉన్న జీవితకాల లైసెన్స్‌ విధానాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో ఐదేళ్లకోసారి లైసెన్స్‌లను పునరుద్ధరించేలా చట్ట సవరణ చేయనున్నారు. ప్రభుత్వరంగంలోని విద్యుత్ సంస్థల మౌలిక సౌకర్యాలన్నింటినీ అద్దె లేదా.. లీజుకు ఇచ్చేలా ఈ చట్ట సవరణ చేయనున్నారు. 

ఇకపై ప్రభుత్వ విద్యుత్ సంస్థలు అన్ని సేవల్ని ప్రైవేటుకు అప్పగించి, వారిచ్చే అద్దెలు, రాయల్టీలు తీసుకుని కాలం వెల్లదీయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ అందుబాటులోకి రావడంతో తుది దశ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దేశంలో ప్రైవేటు విద్యుత్ సంస్థల్ని అవసరానికి మించి అనుమతులిచ్చి ప్రోత్సహించారు. ఆ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేయకున్నా ఫిక్సెడ్ ఛార్జీల పేరుతో వాటిని పోషించేలా కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌ జెన్‌కో 2017-18లో ఈ తరహా ఫిక్సెడ్ ఛార్జీలను 13.897.80కోట్లు చెల్లించింది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యుదుత్పత్తి కేంద్రాలతోపాటు ప్రైవేటు, ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ఒక్క తెలంగాణ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని ఫిక్సెడ్ ఛార్జీలుగా చెల్లిస్తోంది. ఇదే తరహాలో దేశంలోని అన్ని ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలు ఫిక్సెడ్ ఛార్జీలను చెల్లిస్తున్నాయి. 

2003 జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చిన విద్యుత్ చట్టాన్ని కేంద్రం సవరణల పేరుతో మార్పులు చేస్తూ వస్తోంది. 2004 జనవరి 27న ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసింది. తిరిగి 2007 జూన్ 15న మరికొన్ని సవరణలు చేశారు. 2010 మార్చి 3న మరోసారి సవరణ చేశారు. ఆ తర్వాత 2014 డిసెంబరు 19న మరికొన్ని సవరణలతో అప్పటి యూపీఏ ప్రభుత్వం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సవరణలపై మళ్లీ వ్యతిరేకత రావడంతో కొన్ని క్లాజులు తొలగించి, సవరణ బిల్లును అమల్లోకి తెచ్చారు. తాజాగా ఎన్డీఏ సర్కార్ గతంలో తొలగించిన క్లాజులన్నింటినీ అమల్లోకి తెచ్చేలా సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

అయితే, విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 2017 చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ఘాటైన సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉచిత విద్యుత్ విధానాన్ని తమ సంస్కరణలకు అనుకూలంగా మార్చుకునేందుకు దీన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలనుకుంటోంది ఎన్డీఏ సర్కార్. 

Similar News