కాంగ్రెస్ లో చేరడంపై స్పష్టత ఇచ్చిన ఎంపీ డీఎస్

Update: 2018-09-05 13:37 GMT

తెరాస ఎంపీ, డీ శ్రీనివాస్ త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన ఈనెల 11 వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం తీసుకుంటున్నారని.. తనతో పాటు కొందరు టీఆర్ఎస్ నేతల్ని కూడా వెంట తీసుకెళుతున్నారంటూ  పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలను డీఎస్ కొట్టిపారేశారు. అవి కేవలం మీడియా సృష్టేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ నేత బాజిరెడ్డి గోవర్దన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి సందేశం రాలేదని వెల్లడించారు. కాగా  మొన్న(సోమవారం) డీఎస్‌పై నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ద్వారా డీఎస్ కు వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో డీఎస్‌కు సముచితస్థానం ఇస్తే విశ్వాసంగా ఉండకుండా.. పదవుల కోసం కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరిపారని సంచలన ఆరోపణలు చేశారు. దానికి డీఎస్ కూడా అంతేస్థాయిలో కౌంటర్ ఇస్తూ.. తనను పార్టీలో ఉంచుకోవడమా  లేక సాగనంపడమా ఏదో ఒకటి చేయండని అంటున్నారు. 

Similar News