ఆకాశంలో ప్రయాణికులకు చెమటలు పట్టించాడు.. అతని దెబ్బకు రూటు మార్చిన ఎయిరిండియా..

Update: 2018-08-04 11:38 GMT

ఆకాశంలో ఓ వ్యక్తి రచ్చ రచ్చ చేశాడు. గగనతలంలో విమానంలోని ప్రయాణికులకు చెమటలు పట్టించాడు. అతని దెబ్బకు గంటకు పైగా ప్రయాణించిన ఎయిరిండియా విమానం.. వెనక్కి వెళ్లి అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. సంబంధిత వ్యక్తిని పోలీసులకు అప్పజెప్పి.. రెండు గంటలు ఆలస్యంగా మిలాన్ నుంచి ఎయిరిండియా ఏఐ 138 ఢిల్లీకి చేరుకుంది. విషయంలోకి వెళ్తే.. మిలాన్ నుంచి ఎయిరిండియా విమానం శుక్రవారం ఢిల్లీకి బయలు దేరింది. ఈ క్రమంలో గుర్ ప్రీత్ సింగ్ అనే ప్రయాణికుడు హల్ చల్ చేశాడు. విమానాన్ని నియంత్రించే అత్యంత కీలకమైన వ్యవస్థ కాక్ పిట్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అప్పటికే విమానం గంటకు పైగా ప్రయాణించింది. అయితే అతను చేసిన రచ్చకు భయపడిన పైలెట్లు గాల్లో ఉండగానే...విమానం రూటు మార్చారు. తిరిగి మిలాన్ లో విమానాన్ని ల్యాండ్ చేసి... వెంటనే సదరు ప్రయాణికుడిని పోలీసులు అప్పగించారు. 

 ఈ విషయాన్ని ఎయిరిండియా ప్రకటించింది. ఓ విచిత్ర వ్యక్తి కాక్ పిట్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. ఆ సమయంలో ఏం చేయాలతో తెలియక తిరిగి మిలాన్ వెళ్లాల్సి వచ్చినట్లు తెలిపింది. దీంతో 2.37గంటల పాటు విమానం ఆలస్యమైందని పేర్కొంది.  ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సెక్యురిటీ క్లియరెన్స్‌ ఇచ్చిన తర్వాతనే ఎయిర్‌క్రాఫ్ట్‌ తిరిగి బయలుదేరిందని ఎయిరిండియా ప్రకటన చేసింది.
 

Similar News