ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేసీఆర్ ఫోకస్‌

Update: 2018-12-20 16:21 GMT

ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ ఫోకస్‌ పెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఫెడరల్‌ ఫ్రంట్‌‌ ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌‌ ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఈనెల 25నుంచి రెండ్రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్న గులాబీ అధినేత ఆయా పార్టీల ముఖ్యనేతలను కలవనున్నారు. అలాగే ఢిల్లీలో పర్యటనలో ప్రధాని మోడీని కలవనున్న కేసీఆర్‌ తెలంగాణ సమస్యలపై మెమొరాండం ఇవ్వనున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌‌. తొలిసారి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్న కేసీఆర్‌‌ ప్రధాని మోడీని కలవనున్నారు. ముఖ‌్యంగా విభజన హామీల అమలు, కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణ కోసం రక్షణశాఖ భూముల బదిలీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, గిరిజన యూనివర్శిటీ తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఇతర రాజకీయ అంశాలు కూడా ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంతో మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలవనున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికలకు ముందే ఫెడరల్‌ ఫ్రంట్‌‌ ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌‌ ఈ రెండ్రోజుల ఢిల్లీ టూర్‌‌లో ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలను కూడా కలవనున్నారు. ఢిల్లీలో వివిధ పార్టీల ముఖ్యులను కలవనున్న గులాబీ బాస్‌‌ భువనేశ్వర్‌‌ వెళ్లి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌‌తో సమావేశం కానున్నారు. అయితే ఫెడరల్‌ ప్రంట్‌పై కేసీఆర్‌‌ ఎక్కువ దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టంచేశారు.ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఢిల్లీ టూర్‌‌లో తెలంగాణ సమస్యలపై కేంద్రానికి మెమొరాండం అదే సమయంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై ఆయా పార్టీలతో చర్చలు జరపనున్నారు.

Similar News