కాలా కంట ఏంటీ కావేరీ నీరు? కన్నడిగుల కోపమేంటి?

Update: 2018-06-07 05:04 GMT

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌... కాలా సినిమాకు కష్టాలు తప్పడం లేదు. కావేరీ జలాలపై కాకమీదున్న కర్ణాటక... సినిమా విడుదలను అడ్డుకుంటోంది. దీంతో స్వయంగా రజనీఏ... సీఎం కుమారస్వామికి ఓ విజ్ఞప్తి చేశారు. థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. రజనీకాంత్‌ నటించిన ‘కాలా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే కర్ణాటకలో మాత్రం ఈ సినిమాపై నిషేధం విధించారు. కావేరీ నదీ జలాల వివాదం అంశంపై గతంలో రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన కన్నడిగులు సినిమా విడుదల కానివ్వమంటూ ఆందోళన చేపడుతున్నారు. దీనిపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

హై కోర్టు మాత్రం... తాము ఈ విషయంలో కలగజేసుకోలేమని తెలియచేసింది. సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాల్సిందిగా కర్ణాటకను ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును తాను గౌరవిస్తానని, కానీ ‘కాలా’ విడుదలకు ఇది సరైన సమయం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. కర్ణాటకలో కాలా రిలీజ్‌పై... సూపర్‌ స్టార్‌ రజనీకాంత్... కుమార స్వామికి ఓ విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో ‘కాలా’ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరారు. ‘కుమారస్వామి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని, ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అవుతున్నప్పుడు కావేరీ కోసం కర్ణాటక రాష్ట్రం సినిమాను నిషేధించిందని, ఇది కర్ణాటకకు మంచిది కాదన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లకు సమస్య లేకుండా కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ చర్యలు తీసుకోవాలని తళైవా సూచించారు.

మరోవైపు కావేరీ విషయం గురించి కమల్‌ హాసన్‌.. కుమారస్వామితో చర్చలు జరిపారు. చర్చలతో కావేరీ వివాదం సద్దుమణిగితే.. ఎలాంటి పెద్ద సమస్యలకైనా చర్చలతోనే పరిష్కారం దొరుకుతుందని రజనీ కాంత్‌ తెలిపారు. మరి రేపు ప్రపంచ వ్యాప్తంగా కాలా రిలీజ్‌ అవుతుండగా, కర్ణాటకలో రిలీజ్‌ అవుతుందో లేదో, ఒకవేళ విడుదలైతే ఎన్ని గొడవలు జరుగుతాయో అన్న టెన్షన్‌ రజనీ అభిమానుల్లో నెలకొంది.

Similar News