తిరుమలలో ఆగమ శాస్త్రానికి మంగళమా ?

Update: 2017-12-13 09:55 GMT

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలలో ఐరన్ మెట్ల నిర్మాణం.. అర్చకుల ఆధిపత్య పోరుకు కారణమవుతోంది. ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎన్నో జరుగుతున్నాయన్న ప్రధాన అర్చకుడి మాటలు.. మంటలు రాజేస్తున్నాయి. రమణదీక్షితులు టార్గెట్ గా ఆయన ప్రత్యర్థి వర్గం ఫైరవుతోంది. 

 తిరుమల శ్రీవారి ఆలయంలో ఇనుప మెట్ల నిర్మాణంపై వివాదం రాజుకుంటోంది. ముందస్తు చర్చలు జరపకుండా, పండితులను సంప్రదించకుండా ఈ పని కానిచ్చేశారని టీటీడీ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే... అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. కానీ... భక్తుల ప్రశ్నలకు, విమర్శలకు మాత్రం సరైన
సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారుల వైఖరిపై ఓ వైపు నిరసనలు వెల్లువెత్తుతుండగానే.. ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు మాటల మంటలు రేపుతున్నాయి. 

 శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఏం జరుగుతోందని ప్రశ్నించడంతో పాటు.. ఆగమాలకు విరుద్ధంగా అనేకం జరుగుతున్నాయని రమణ దీక్షితులు చెప్పడం కలకలం రేపుతోంది.తన ప్రత్యర్థి వర్గంపై నర్మగర్బంగా మాటల తూటాలు పేల్చిన రమణదీక్షితులు... ఆ తప్పులతో పోల్చుకుంటే మెట్ల నిర్మాణం పెద్ద తప్పుకాదన్నట్లుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపైనే ఆయన ప్రత్యర్థి వర్గం భగ్గుమంటోంది. స్వప్రయోజనాల కోసమే అలా మాట్లాడారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీటీడీ అధికారుల నిర్ణయాన్ని సమర్ధించడమే కాకుండా... ఆగమ శాస్త్రాలకు మంగళం పాడేసినట్లు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సరికాదని సూచిస్తున్నారు.

 మొత్తంగా రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలతో ఇంతకాలం అర్చకుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరోవైపు... ఆగమ శాస్త్రాల ప్రకారమే ఆలయంలో మార్పులు జరుగుతున్నాయని ఇంతకాలం భావిస్తున్న భక్తుల్లో.. వీరి మాటల యుద్ధంతో మరెన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

Similar News