నైతికంగా SRH గెలిచిందా?

Update: 2018-05-28 04:01 GMT

నిన్న (ఆదివారం) జరిగిన ఐపీఎల్ 11 ఫైనల్ మ్యాచ్ లో అందరూ ఊహించినట్టుగానే చెన్నై గెలుపొందింది. తొలుత బ్యాటింగుకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ బరిలోకి దిగిన చెన్నై జట్టు మొదటినుంచీ దూకుడు కొనసాగించింది. చెన్నై ఆటగాడు షేన్ వాట్సన్ సెంచరీతో చెలరేగిపోయాడు. జట్టు విజయంలో  కీలక పాత్ర పోషించాడు.. దీంతో చెన్నై జట్టు మూడోసారి  ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలావుంటే హైదరాబాద్ అభిమానులు తమ జట్టు ఓటమి చెందిందని బాధపడటం కన్నా.. పోరాడి ఓడిందనే ఒకింత సంతోషంలో ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు ఎలాంటి అంచనాలు లేవు,పైగా హైదరాబాద్ జట్టు ఫైనల్ వరకు వస్తుందనే ఆశకూడా లేదు.. అలాంటిది ఏకంగా ధోని సారధ్యంలోని చెన్నైకి ఎదురీదింది. మొదటినుంచి నిలకడగా ఆడుతూ చేసేది తక్కువ స్కోర్లే అయినా ప్రత్యర్థిని నిలువరించడంలో పూర్తి సక్సెస్ అయింది. పాయంట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంటూ.. ఇతర జట్లకు ముచ్చెమటలు తెప్పించింది. సన్ రైజర్స్ ఓడిపోతుంది.. అనుకున్న మ్యాచ్ సైతం అనూహ్యంగా విజయం  సాధిస్తుండటం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ కు అర్హత సాధించి జరిగిన రెండు మ్యాచ్ లలో కీలక మ్యాచ్ లో విజయం సాధించింది. దీంతో ఫైనల్ లో అడుగుపెట్టిన SRH గెలవాలని అందరూ అనుకున్నారు. అంతేకాదు ఈ ట్రోఫీలో చెన్నై కన్నా హైదరాబాదే గెలవాలని అనుకున్న టీమ్ లే ఎక్కువంటే అతియోశక్తి కాదు.. అంతలా సింపతీ ఏర్పడింది. అందరూ ఊహించినట్టుగానే SRH బ్యాట్స్ మెన్ లు తమ బ్యాట్ ను ఝళిపించారు. కానీ ప్రత్యర్థి బ్యాటింగ్ దాటికి హైదరాబాద్ బౌలర్లు చేతులెత్తేశారు. విజయం  చెన్నై సొంతమైంది. కాగా తమ అభిమాన జట్టు ఓడినా గౌరవనీయంగానే ఉందని నైతికవిజయం తమదేనని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.   

Similar News