శబరిమలకు మహిళలను అనుమతిస్తే.. ఆ ప్రాంతం సెక్స్ టూరిజం స్పాట్ అవుతుంది

Update: 2017-12-13 14:36 GMT

శబరిమలకు మహిళలను అనుమతిస్తే ఆ ప్రాంతం థాయ్ లాండ్ తరహాలో సెక్స్ టూరిజం స్పాట్ అవుతుందని  దేవస్థానం బోర్డు చీఫ్ ప్రయర్ గోపాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్ని రేకెత్తించాయి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ళ లోపు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం అంశాన్ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిన నేపథ్యంలో గోపాలకృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలను అనుమతించడం అనైతిక కార్యకలాపాలు చోటు చేసుకునేందుకు దారి తీస్తుందని  గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. 

మహిళలను అనుమతిస్తే శబరిమల సెక్స్ టూరిజం స్పాట్ అవుతందన్న గోపాలకృష్ణన్ అంతకు మించిన వ్యాఖ్యలు కూడా చేశారు. మహిళల ప్రవేశం పై నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసినా కూడా, గౌరవప్రద మహిళలెవరూ ఆలయంలోకి రారని కూడా అన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ళ లోపు మహిళల ప్రవేశంపై  ఎన్నో ఏళ్ళుగా ఉన్న నిషేధాన్ని కొనసాగించేందుకే ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావెన్ కోర్ దేవస్వోం బోర్డ్ మొగ్గుచూపుతోంది. 

 దేవస్థానం బోర్డు చీఫ్ ప్రయర్ గోపాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను కేరళ దేవాదయ, పర్యాటక శాఖ మంత్రి కొడకంపల్లి సురేందరన్ తప్పుబట్టారు. మహిళలను, అయ్యప్ప భక్తులను కించపరిచేవిగా గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో ప్రవేశానికి సంబంధించి ఎలాంటి లింగవివక్ష ఉండకూడదనేదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులను తాము గౌరవిస్తామన్నారు.

Similar News